Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకి వస్తే ఏం చేయాలో దిశా నిర్దేశం
- సభ నిర్వహణకు పలు కమిటీలు
- పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు
- భారీ జనసమీకరణ
- పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరంగల్‌లో మే ఆరున జరగబోయే రైతు సంఘర్షణ సభ రాష్ట్ర చరిత్రలో ఇరవై ఏండ్లపాటు నిలిచిపోయేలా నిర్వహించాలని టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్ణయించింది. ఆ సభకు రాహుల్‌గాంధీ హాజరు కానుండటంతో భారీ సమీకరణ చేపట్టాలని భావిస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి జనసమీకరణ కోసం పక్క కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించింది. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. రైతు సంఘర్షణ బహిరంగసభ విజయవంతం కోసం తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం నేతలతో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా టీఆర్‌ఎస్ బలంగా ఉందంటూ ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. కాంగ్రెస్ వరంగల్ సభతో ఆ పరిస్థితి మారిపోవాలని ధీమా వ్యక్తం చేశారు. ఇరవై ఏండ్ల కింద (2002)లో వి హనుమంతరావు నిర్వహించిన 'బీసీ గర్జన' గురించి చర్చ ఇప్పటికీ జరుగుతుందని చెప్పారు. ఆ సభకు వచ్చి వెళ్లిన సోనియాగాంధీ తిరిగి కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారని గుర్తు చేశారు. రైతు సంఘర్షణ సభ గురించి మరో 20 ఏండ్లు చర్చించుకునే విధంగా దాన్ని నిర్వహించాలని కోరారు. జనసమీకరణకు బాధ్యులను నియమించాలని సూచనలు వచ్చాయని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఏ విధమైన విధానాలు అమలు చేయాలో కూడా సభలో దిశా నిర్దేశం చేస్తామన్నారు. మహిళలు, దళిత, గిరిజనుల సమస్యలను ప్రస్తావించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈనెల 25న కరీంనగర్, 26న ఖమ్మం, 27న నల్గొండ జిల్లాల్లో పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయా జిల్లాలో ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఏడు పార్లమెంట్ నియోజక వర్గాలకు ఇన్‌చార్జీలను నియమిస్తామన్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు ఇన్‌చార్జిలుగా ఉన్న నాయకులు సభకు జనసమీకరణ కోసం కృషి చేయాలని కోరారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాహుల్ గాంధీ ప్రసంగాన్ని సిద్ధం చేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ సంఘాల నాయకులతో వాలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. మే ఏడున ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చేలా కషి చేస్తామన్నారు. వీసీకి వినతి పత్రం ఇచ్చి ఆయన కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేలా చూడాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మహేష్‌కుమార్‌గౌడ్, దామోదర రాజనర్సింహ, చిన్నారెడ్డి, బలరాంనాయక్, వి హనుమంతరావు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లు తదితరులు హాజరయ్యారు.