Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామమాత్రంగా తెరుచుకున్న కొనుగోలు కేంద్రాలు
- కొన్నిచోట్ల ప్రారంభం.. మరికొన్నిచోట్ల ఆలస్యం
- ప్రయివేటు వ్యాపారులకు ఇప్పటికే సగం పంట విక్రయం
- వర్షాలు వస్తాయని రైతుల్లో ఆందోళన
నవతెలంగాణ ప్రాంతీయ ప్రతినిధులు - ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్
యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పిన ప్రభుత్వం.. చివరికి ధాన్యం కొనుగోళ్లకు సిద్ధమైన విషయం తెలిసిందే. పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పినా, ఆ స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కేంద్రాలు తెరుచుకోలేదు. వరి వేయొద్దనడంతో చాలామంది రైతులు సాగు చేయలేదు. వరి తప్ప ఇతర పంటలు పండని మాగాణి భూముల్లోనే పంట సేద్యం చేశారు. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ పంటలు సాగు చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీలో దీక్ష చేశారు. అయినా, కేంద్రం నుంచి స్పందనలేకపోవడంతో 13వ తేదీ నుంచి తామే కొంటామంటూ.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లకు సిద్ధమైంది. క్వింటాలు ధాన్యం కనీస మద్దతు ధర రూ.1960గా నిర్ధారించింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే ముందుగానే ధాన్యం వచ్చిన చోట్ల రైతులు ప్రయివేటు వ్యాపారులకు అమ్ముకున్నారు. చాలా తక్కువ ధరకు ధాన్యాన్ని రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. రైతులు ప్రయివేటు వ్యాపారులకు క్వింటాల్ రూ.1200 నుంచి రూ.1650 వరకు విక్రయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని ప్రకటించినంత వేగంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఎక్కడైతే ధాన్యం వచ్చిదో అక్కడే కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కేంద్రాల వద్ద కూలీల కొరత కూడా వేధిస్తోంది. వర్షాలు, ఈదురుగాలులు పడితే ..తీవ్ర నష్టం వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వానాకాలం తరహాలోనే ఖమ్మం జిల్లాలో 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటి వరకు 189 కేంద్రాలను మాత్రమే అధికారులు ప్రారంభించారు. వాస్తవానికి 40లోపు కేంద్రాల్లోనే కొనుగోళ్లు జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈనెల 20వ తేదీ వరకు ఖమ్మం జిల్లాలో 25 మంది రైతులు 221.320 మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించారు. వీరికి ప్రభుత్వం రూ.43,37,872 చెల్లించింది. హెక్టార్‌కు 2.300 మెట్రిక్ టన్నుల చొప్పున 1.05 లక్షల ఎకరాలకు 2,42,896 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖలు అంచనా వేశాయి. జూన్ నాటికి కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్ధారించారు. అయితే, ఇప్పటికే సగానికి పైగా ధాన్యం ప్రయివేటు వ్యాపారులకు విక్రయించినట్టు రైతులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. జిల్లా వ్యాప్తంగా 154 ధాన్యం కొనుగోలు కేంద్రాల 55వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనెల 25వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో ..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 20లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి 948 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. సుమారు 2.25కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు 451 కేంద్రాలను ఏర్పాటు చేసి కేవలం 8254 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే సేకరణ చేశారు. 95లక్షల గన్నీబ్యాగులు అందుబాటులో పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్క గింజ కూడ కొనుగోలు చేయలేదు. ఈ కాలంలో వర్షాలు, ఈదురుగాలులు సంభవించడం సహజం .. అందుకే కొనుగోళ్లు వేగంగా జరిగితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు.
నిజామాబాద్‌లో డబ్బుల చెల్లింపుల్లో ఆలస్యం..
ధాన్యం అమ్మిన రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం ప్రారంభం కాలేదు. కొనుగోలుకు సంబంధించిన ట్యాబ్ ఎంట్రీ పూర్తిస్థాయిలో జరగడం లేదు. నిజామాబాద్ జిల్లాలో 43,582 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 382 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలు మాత్రమే ట్యాబ్‌లో ఎంట్రీ చేశారు. రైతులకు సుమారు రూ.86 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
వరంగల్, మహబూబ్‌నగర్‌లో..
వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పూర్తిస్థాయిలో కేంద్రాలు ఏర్పాటు కాలేదు. మహబూబ్‌నగర్ జిల్లాలో నాట్లు ఆలస్యం కావడంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం అయినా .. ధాన్యం పూర్తిస్థాయిలో రావడం లేదని అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలోనూ 2,3 కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మొత్తం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. 460 కేంద్రాలకు గాను 412 కేంద్రాలు ప్రారంభించి నప్పటికీ.. కేవలం 234 కేంద్రాల్లోనే కొనుగోలు జరుగుతోంది.
పచ్చివడ్లే అమ్ముతున్నాం...
ఊళ్లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంకా ప్రారంభం కాలేదు. యంత్రాలతో కోత కోయగానే పచ్చివడ్లనే స్థానిక వ్యాపారికి అమ్మాను. క్వింటాల్ రూ.1,650 చొప్పున అమ్మా. భూమి కౌలుకు తీసుకుని ఏడు ఎకరాల్లో వరి వేశా. కౌలు కాకుండా ఎకరానికి రూ.20వేల చొప్పున పెట్టుబడి పెట్టా. మొత్తం 177 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మొత్తం హెచ్‌ఎంటీ సన్నరకం వడ్లనే పెట్టా. కానీ ఏమంత లాభం లేదు.
- బోడా శంకర్, కౌలు రైతు, బంధంపల్లి, తిరుమలాయపాలెం