Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గవర్నర్‌పై టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీరు సరిగాదు
- రాష్ట్రంలో పెట్రేగిపోతున్న మాఫియాలు : కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపే, ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలు, జర్నలిస్టులు, సోషల్‌మీడియా యాక్టివిస్టుల పట్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్, ఇతర మంత్రులకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదనీ, సీఎం కేసీఆర్ మాట్లాడితే చెబుతానని వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు వ్యవహరిస్తున్న తీరు సరిగాదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సహకారంతో భూ, ఇసుక, లిక్కర్, బియ్యం, మైన్స్ మాఫియాలు పేట్రేగిపోతున్నాయని ఆరోపించారు. మళ్లీ గెలుస్తామో? లేదో? ఉన్న సమయంలోనే దోచుకోవాలనే తీరు ఉత్తర తెలంగాణ జిల్లాల ఎమ్మెల్యేల్లో ఎక్కువగా కనిపిస్తున్నదని విమర్శించారు. సాయిగణేశ్ విషయంలో వాస్తవాలు తెలిసినా అధికార పార్టీ ఒత్తిడితో పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ నేతలు ధర్నా చేస్తే ఆదిలాబాద్‌లో అరెస్టులు చేస్తున్నారనీ, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాలకు చేసిన ఖర్చెంత? ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం ఎంత ఖర్చుపెట్టారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ చేతిలో డబ్బులు పెడితేనే కేంద్రం నిధులిచ్చినట్టా? అని ప్రశ్నించారు. ఈ నెల 29న రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని తెలిపారు. ఎమ్‌ఎమ్‌టీఎస్ రెండోదశ ఏమైందనీ, అప్జల్‌గంజ్ దగ్గరే మెట్రో ఎందుకు ఆగిందో చెప్పాలని ప్రశ్నించారు. మోడీ అవినీతి చిట్టా ఉందని చెబుతున్నారుగా దమ్ముంటే బయపెట్టి నిరూపించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు.