Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెత్త, ప్లాస్టిక్ సేకరణకు ప్రత్యేక బృందాలు
- రీసైక్లింగ్ కేంద్రాల ఏర్పాటు
- అమ్రాబాద్ టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ రీసైకిల్ విధానం విజయవంతం
- రాష్ట్రవ్యాప్తంగా అమలుకు అటవీశాఖ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనరాష్ట్రంలోని అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులను పూర్తి ప్లాస్టిక్ ఫ్రీ దిశగా మార్చేందుకు అటవీ శాఖ చర్యలు చేపట్టింది. అడవుల సమీప ప్రాంతాల ప్రజలతో, అలాగే అటవీ రహదారుల గుండా ప్రయాణించే వారు విసిరే వస్తువులతో అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్, చెత్తా చెదారం పేరుకుపోతున్న విషయం విదితమే. అలా పోగుపడిన చెత్త వన్యప్రాణులతో పాటు, అటవీ ప్రాంతాలకు తీవ్రముప్పుగా మారుతున్నది. చాలాచోట్ల అగ్నిప్రమాదాలకు కూడా కారణమవుతున్నది. దాన్ని నివారించేందుకు అటవీశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతంలో శ్రీశైలం ప్రధానరహదారి(65 కిలో మీటర్ల మేర), దాని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొన్నేండ్లుగా చెత్త సేకరణ సేకరించి ప్లాస్టిక్ రీసైకిలింగ్‌కు పంపే విధానం విజయవంతంగా కొనసాగుతున్నది. దీంతో అమ్రాబాద్ అటవీ ప్రాంతం, రహదారికిరువైపులా ఇప్పుడు పరిశుభ్రంగా మారింది. ఇదే విధానాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా చేపట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల సూచన మేరకు కవ్వాల్ టైగర్ రిజర్వులో ఇటీవల చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహించారు. సుమారు వెయ్యి కేజీల ప్లాస్టిక్, ఇతర చెత్తను అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. రెండు టైగర్ రిజర్వులు (అమ్రాబాద్, కవ్వాల్) మూడు జాతీయ ఉద్యాన వనాలు (కేబీఆర్, మృగవని, హరిణివనస్థలి), నాలుగు అభయారణ్యాల్లో (పాకాల, కిన్నెరసాని, పోచారం, ఏటూరునాగారం), అటవీ అర్బన్ పార్కులు(109), జూ పార్కుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అన్ని అటవీ ప్రాంతాల్లో చెత్త సేకరణను ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయటం, రీ సైకిల్ పాయింట్ల ఏర్పాటు, చెత్తను విడదీయటం (సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్), బెయిలింగ్, ప్రాసెసింగ్ యూనిట్‌కు తరలింపును దశల వారీగా చేపట్టనున్నారు. ఈ విధానంలో అడవులపై ఆధారపడే జీవించే స్థానికులకు కొంత ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంది. ప్లాస్టిక్ బాటిల్స్, రేపర్స్, ఇతర చెత్తను, సిగరెట్ పీకలను అటవీ ప్రాంతాల్లో విసిరివేయొద్దని మార్గంలో ఎక్కడికక్కడ బోర్డులను ఏర్పాటు చేయించింది.
ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలిగితేనే అడవులను రక్షించుకోగలం : పీసీసీఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్
అటవీ ప్రాంతాల గుండా ప్రయాణించే వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అడవులు, వణ్యప్రాణులకు ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న అనర్థాలు, పర్యావరణ పరంగా పొంచి ఉన్న ముప్పుపై అందరూ అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే అడవులను రక్షించుకోగలుగుతాం. అడవుల్లోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యూ పాయింట్లు, వాటర్ ఫాల్స్, ఫారెస్ట్ అర్బన్ పార్కులకు సందర్శకుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నది. అదే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా పేరుకు పోవటం బాధాకరం. ప్లాస్టిక్ రహిత, బాధ్యతాయుత పర్యావరణ పర్యాటకాన్ని (రెస్పాన్సిబుల్ ఎకో టూరిజం) ప్రోత్సహిస్తున్నాం. దీనికి ప్రతిఒక్కరి సహకారం కావాలని కోరుతున్నాం. స్వచ్చంద సంస్థల సహకారం కూడా తీసుకుంటాం.