Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య
నవతెలంగాణ ఖమ్మం
పువ్వాడ అజరుకుమార్‌కు రెండు, మూడు పార్టీలు మారి దిక్కుతోచని స్థితిలో ఉంటే రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అనే విషయం గుర్తుకు తెచ్చుకోవాలని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దెబ్బల సౌజన్య అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఖమ్మం నగర మేయర్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతోందన్నారు. కేంద్ర మంత్రిగా చేసిన రేణుకాచౌదరిని సాటి మహిళవై ఉండి విమర్శించడం సిగ్గుచేటన్నారు. పువ్వాడ అజరు వేధింపులకు విపక్ష నేత మరణిస్తే అది చిన్న విషయం అంటూ అనడం టీఆర్‌ఎస్ రౌడీ పాలనకు అద్దం పడుతోందన్నారు. మహిళా దినోత్సవం రోజైనా ప్రెస్‌మీట్ పెట్టని మేయర్ పువ్వాడ అజరు చేస్తున్న అరాచకాలకు వత్తాసు పలుకుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టడం హాస్యస్పదంగా ఉందన్నారు. వీధి లైట్లు లేని నగరంలో ఫౌంటేన్లు ఏర్పాటు చేస్తే నగరం అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత మందికి ఎన్ని రేషన్ కార్డులు మంజూరు చేశారో మేయర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడేండ్ల నుంచి కొత్త పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
అధికార పార్టీ వారు ధర్నాలు చేస్తే పోలీసులు రక్షణగా ఉంటారని, ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే మాత్రం అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. పోలీస్ వ్యవస్థ ప్రజలకే కానీ అధికార పార్టీకి, మంత్రికి కాదని చెప్పారు. పువ్వాడ అజరుకి భయం పట్టుకుందని, అందుకే కులం పేరుతో మళ్ళీ కొత్త తరహా రాజకీయానికి తెరదీస్తున్నాడని వ్యాఖ్యానించారు. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభతో కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో చూపిస్తామని తెలిపారు. 54వ డివిజన్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ.. అన్నం పెట్టినోడికి సున్నం పెట్టడంలో పువ్వాడ అజరు దిట్ట అని విమర్శించారు. ఇకనైనా ప్రతిపక్ష కార్పొరేటర్లపై తప్పుడు ఆరోపణలు మాని అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హెచ్చరించారు. అనంతరం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు మంత్రి శవయాత్ర చేసి దిష్టిబొమ్మ దహనం చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు పల్లెబోయిన భారతి, రషీదా భేగం, జిల్లా మహిళా నాయకురాలు ఏలూరి రజిని, పుష్ప తదితరులు పాల్గొన్నారు.