Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ పాలనలో సామాన్యుల బాధలు రెట్టింపు
- ఎంసీపీఐ(యూ) ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌లో సెప్టెంబర్‌లో ఎంసీపీఐ(యూ) జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఓంకార్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధానికి మూలకారణం అమెరికా సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షనే అని విమర్శించారు. యుద్ధాలతో పర్యావరణం తీవ్రం దెబ్బతింటున్నదనీ, చమురు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయని వాపోయారు. ప్రపంచ కమ్యూనిస్టు పార్టీలు, శాంతి కాముకులు ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరిగేలా చూసి సమస్యను పరిష్కరించాలని కోరారు. బీజేపీ పాలనలో సామాన్యులు బాధలు రెట్టింపు అయ్యాయనీ, మోడీ సర్కారు దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నదని విమర్శించారు. మోడీ, అమిత్‌షాలు కలిసి రాష్ట్రాల హక్కులను పూర్తిగా హరించివేస్తున్నారని తెలిపారు. లౌకిక, ప్రజాస్వామ్య విలువలకు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో తాము కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. పొలిట్‌బ్యూరో సభ్యులు కిరణ్‌జిత్‌సింగ్ షేఖాన్ మాట్లాడుతూ..దేశ వ్యవసాయ రంగాన్ని మోడీ సర్కారు అంబానీ, అదానీలకు కట్టబెట్టే కుట్రకు పూనుకున్నదని విమర్శించారు. ఐక్యంగా పోరాడటంతోనే రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టగలిగామన్నారు. మోడీ సర్కారు వచ్చాక పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయనీ, దాని ప్రభావంతో నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతున్నదని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో రైతులకు ఒక్క యాపిల్ పండుకు రైతుకు రూ.5 కూడా దక్కట్లేదనీ, అదే మార్కెట్‌లో కేజీ యాపిల్ పండ్లకు వందరూపాయలకుపైగా ఉందనీ, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోడీ సర్కారు రైతు వ్యతిరేక ప్రభుత్వ కాకపోతే ఇకేం అవుతుందని ప్రశ్నించారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ రాజకీయ లబ్దిపొందుతున్నదని విమర్శించారు. ప్రజలంతా రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువల రక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) పొలిట్‌బ్యూరో సభ్యులు మహేందర్ నేహ, కె.నాగభూషణం, అనుభవ్‌దాస్ శాస్త్రి, ఈ.జార్జ్, చంద్రమోహన్‌ప్రసాద్, జయంతోగుప్తా భయ్యా, కృష్ణమాల్, రాజుదాస్, సులీప్, కేబీ శర్మ, ఉపేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జి.రవి, వనం సుధాకర్, షాజహాన్, నారాయణసింగ్, కె.సుకన్య, సాంబయ్య, వి.వెంకన్న తదితరులు పాల్గొన్నారు.