Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
- హైదరాబాద్‌లో 68వేల మంది దరఖాస్తులు పెండింగ్‌లో..!
- రేషన్ కోటా, సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన
- కార్డుదారులను పట్టించుకోని అధికారులు
- ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్న వైనం
నవతెలంగాణ-సిటీబ్యూరో
అంబర్‌పేటకు చెందిన గండిపల్లి బాలామణి భర్త చనిపోవడంతో వితంతు పింఛన్ కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకుంది. భర్త స్థానంలో తనకు పింఛన్ మంజూరు చేయాలని సంబంధిత అధికారులను సంప్రందించింది. అన్ని పత్రాలను పరిశీలించిన అధికారులు రేషన్ కార్డులో పేరు తుమ్మ బాలామణిగా ఉందని ఆధార్ కార్డు ప్రకారం గండిపల్లి బాలామణిగా మార్చుకోని రావాలని సూచించారు. దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులను సంప్రదించగా.. మీ-సేవలో దరఖాస్తు చేసుకోమని చెప్పడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తుంది. కానీ ఇప్పటికీ పేరు మారలేదు. మరోవైపు ప్రభుత్వం ఆ వెబ్‌సైట్‌ను బంద్ పెట్టడంతో మార్పులు చేర్పులకు అవకాశం లేకుండాపోయింది. ఇంకోవైపు బాధితులు ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
ఇదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి కల్లూరి మత్స్యగిరిది ఇదే సమస్య. ఈయన పేరు ఆధార్ కార్డులో మత్స్యగిరి అని ఉండగా.. రేషన్ కార్డులో మాత్రం కల్లూరి మత్‌స్యగిరి అని పడింది. అతను కూడా తన పేరును రేషన్ కార్డులో సరిగా నమోదు చేయాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. అధికారులు నుంచి ఎలాంటి స్పందన లేదని చెబుతున్నాడు. ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాడు.
రాంనగర్ ప్రాంతానికి చెందిన రమేష్ ప్రయివేటు ఉద్యోగి. తన ఇద్దరు కొడుకుల పేరును రేషన్ కార్డులో చేర్పించేందుకు మీ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారు. దాదాపు ఎనిమిది నెలలు పూర్తయినా ఇప్పటికీ కార్డులో పేరు నమోదు కాలేదు. దీంతో ప్రతి నెలా కొడుకుల కోటాకు సంబంధించిన రేషన్ బియ్యం పొందలేకపోతున్నారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎప్పుడూ నమోదు అవుతాయో చెప్పడం లేదని, ఆరోగ్యశ్రీతో పాటు ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇది కేవలం ఈ ముగ్గురికి ఎదురవుతున్న సమస్యే కాదు. ఎంతో మంది చిన్నారుల పేర్లు, కొత్తగా పెండ్లి చేసుకుని వేరే కుటుంబం పెట్టుకున్నవారు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు కార్డు బదిలీ కోసం, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చిన యువతుల పేర్లు వారి కుటుంబానికి జారీ చేయబడిన రేషన్ కార్డుల్లో నమోదు కావడంలేదు.
దరఖాస్తుల స్వీకరణకే పరిమితం..!
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీని గతేడాది జులైలో ప్రారంభించిన విషయం తెలిసిందే. కానీ పాత కార్డుల్లో ఎవరైనా కుటుంబ సభ్యుల పేర్లను చేర్చాలంటే పౌరసరఫరాల శాఖ ఆమోదం తెలపడం లేదు. ఫలితంగా ఎంతో మంది సంక్షేమ పథకాలను లబ్ది పొందడానికి అర్హత సాధించడం లేదు. కొత్త కార్డుల జారీతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 6.36లక్షలకు చేరింది. పాత కార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్పించడానికి పౌర సరఫరాలశాఖకు జిల్లాలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఆరేండ్ల కాలంలో దాదాపు 1,21,643 దరఖాస్తులు రాగా.. 68,430 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
డిలీట్ ఆప్షన్ లాగే ఎడిట్‌కు అవకాశమివ్వాలి
ఇదిలావుండగా ఎవరైనా కుటుంబ సభ్యులు మరణిస్తే వారి పేర్లను రేషన్ కార్డుల నుంచి వెంటనే తొలగించడంతో పాటు వారి కోటా బియ్యాన్ని ప్రభుత్వం మినహాయిస్తుంది. కానీ కొత్త సభ్యులకు చేర్పించడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంలేదు. దీంతో కొత్త సభ్యులను చేర్పించడానికి మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నా రేషన్ కార్డుల్లో నమోదు చేయడానికి పౌరసరఫరాల శాఖ ఆమోదం చెప్పడం లేదు. దీనివల్ల ఎంతో మంది నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అయితే రేషన్‌కార్డుల్లో మరణించిన వారి పేర్లు తొలగించినట్టుగానే కుటుంబంలో ఎవరైనా సభ్యులు చేరితే వారి పేర్లను ఎప్పటికప్పుడు చేర్చడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాల్లేవు
రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రస్తుతానికి మూడేండ్ల క్రితం ఏ పరిస్థితి ఉందో నేటికీ అలాగే ఉంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. శాఖాపరమైన గైడ్‌లైన్స్ వస్తే అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
- రమేష్, పౌరసరఫరాల శాఖ అధికారి, హైదరాబాద్