Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కానీ విశ్వ ప్రయత్నం చేస్తోంది...
- మీ ప్రభుత్వంపైనా వ్యతిరేకత ఉంది.
- ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి..: సీఎం కేసీఆర్‌తో చర్చల్లో ప్రశాంత్ కిశోర్
- సర్వే రిపోర్టును అందజేసిన పీకే
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గతంతో పోలిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)... సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల్లోని ముఖ్య నాయకులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాల ఆధారంగా తెలంగాణలో బలపడేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నం చేస్తోందని హెచ్చరించారు. అయితే ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా ఆ పార్టీకి అంత సీన్ లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణలో ఎన్నికల వ్యూహాలు, ఎత్తుగడలపై సమాలోచనలు చేసేందుకు వీలుగా హైదరాబాద్‌కు వచ్చిన పీకే...శనివారం రాత్రి ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌లోనే బస చేశారు. ఈ క్రమంలో ఆదివారం కూడా ఆయన ముఖ్యమంత్రితో పలు అంశాలపై చర్చించారు. సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన సర్వేకు సంబంధించిన రిపోర్టును కేసీఆర్‌కు అందజేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఆర్నెల్ల క్రితం నిర్వహించిన సర్వేతో పోల్చితే ఇప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని పీకే చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న రైతులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే, ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీకి ఇక్కడ అనుకూల వాతావరణం లేదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక, ప్రాంతీయ పార్టీల వైఖరి తదితరాంశాలపై ప్రశాంత్ కిషోర్‌తో.. కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. మరోవైపు వచ్చే ఎన్నికల కోసం పీకే నేతృత్వంలోని 'ఐప్యాక్' సేవలను ఇప్పటికే వినియోగించుకుంటున్న టీఆర్‌ఎస్...వాటిని కొనసాగించాలని నిర్ణయించింది. ఆ సంస్థ నివేదికలను పరిశీలించిన కేసీఆర్... ఒకరిద్దరు పార్టీ ముఖ్య నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవనీ, వాటిపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని సీఎం చర్చల సందర్భంగా అభిప్రాయపడ్డారు. కొంతమంది జిల్లా స్థాయి నాయకుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తామంటూ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. వారిపై వస్తున్న ఆరోపణలను తేలిగ్గా తీసుకోవద్దని, దీనిపై పార్టీలో చర్చించి త్వరగా నిర్ణయం తీసుకుంటామంటూ ఆయన పీకేతో చెప్పినట్టు సమాచారం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రాల హక్కులను హరిస్తున్న వైనం, ఆ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్, ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పరిస్థితి తదితరాంశాలు కూడా వారిద్దరి మధ్య చర్చకొచ్చాయి. రైతు సమస్యలపై జాతీయ రైతు సంఘాలు నిర్వహించే ప్రతి కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతిస్తామంటూ సీఎం చెప్పినట్టు వినికిడి. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీల నాయకులతో తాను జరిపిన చర్చల సారాంశాన్ని ప్రశాంత్ కిషోర్‌కు ఆయన వివరించారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి సాధ్యపడకపోతే కొత్త పార్టీని ప్రకటిస్తానంటూ కేసీఆర్ ఈ సందర్భంగా అన్నట్టు సమాచారం.