Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కటుకోజ్వల ఆనందాచారి
- పుస్తకావిష్కరణలో వక్తలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ సమాజం కుల, మత ఆధిపత్యాలను సహించదనీ, వాటిపై యుద్ధం చేయడమే ముందున్న కర్తవ్యం అని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ అన్నారు. మతోన్మాదం ప్రమాదకరంగా వేళ్లూనుకుంటున్నదనీ, అది బలపడకుండా పెకలించాల్సిందేననీ చెప్పారు. ఆదివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రముఖ రచయిత, తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కటుకోజ్వల ఆనందాచారి రచించిన 'ఇక ఇప్పుడు...' కవిత్వ పుస్తకావిష్కరణ కార్యక్రమం కవి యాకూబ్ అధ్యక్షతన జరిగింది. ప్రముఖ కవి, రచయిత కే శివారెడ్డి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిధిగా జూలూరి గౌరీశంకర్ హాజరై ప్రసంగించారు. పుస్తకాలు ముద్రించకున్నా జనం నాలుకలపై కవులు సజీవంగా ఉన్నారనీ, మనిషి ఉనికిలో కవిత్వం ఉండటమే దీనికి కారణమని చెప్పారు. ప్రస్తుత సమాజ పరిణామాలు అత్యంత ప్రమాద కరంగా ఉన్నాయనీ, ఆధిపత్య భావజాలాలపై యుద్ధం జరగాల్సిందేననీ, దానికి ఆనందాచారి కవిత్వ పుస్తకం బాట వేస్తున్నదని అన్నారు. 'ఇక ఇప్పుడు...' అంటూ అందరూ ఇప్పుడేం చేయాలో ఈ పుస్తకం మార్గనిర్దేశనం చేస్తున్నదనీ, నిజమైన దేశభక్తి కవితలు దీనిలో ఉన్నాయని ప్రసంసించారు. కవిత్వంలో అగ్నికణాలతో ప్రేమనూ కురిపించడం రచయిత ప్రత్యేకత అని చెప్పారు. పుస్తకావిష్కర్త కే శివారెడ్డి, ప్రముఖ కవులు, రచయితలు నందినీ సిధారెడ్డి, ప్రసేన్, తెలకపల్లి రవి, బన్న ఐలయ్య, సీతారాం, డాక్టర్ ఎస్ రఘు, మెర్సీమార్గరేట్, నస్రీన్‌ఖాన్, వల్లభాపురం జనార్థన, స్ఫూర్తి, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, కట్టా నర్సింహా మాట్లాడారు. పద్యం రాసేవరకే రచయితది అనీ, బయటకు వచ్చాక అది ప్రజలదేనని చెప్పారు. కవిత్వానికి కాలం చెల్లదనీ, మానవజాతి ఉన్నంతకాలం అది సజీవంగా నిలిచేఉంటుందన్నా రు. మనిషిలోని అంతర్ముఖమే కవిత్వమని విశ్లేషించారు. సామాజిక సంఘటనలకు తక్షణ స్పందనలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పారు. మనుషుల్ని ప్రేమించి, మంచితనాన్ని నిలబెట్టే కవిత్వం ఆనందాచారి రచనల్లో ఉన్నదని కొనియాడారు. ప్రస్తుత సమాజ పరిణామంలో యువతరం వ్యక్తిత్వ భావజాలం నుంచి దూరమవుతున్నదనీ, రచయిత ఈ పుస్తక రచన ద్వారా దాన్ని భర్తీ చేశారని అభిప్రాయపడ్డారు. ప్రజల పక్షాన నిలవని, ప్రయోజనం లేని కవిత్వం ఎంత కళాత్మకంగా, సౌందర్యంగా రాసినా వృధానే అనీ, కవులకు అదే సూటి ప్రశ్నను ఈ పుస్తకంలో రచయిత సంధించారని అన్నారు. రచయిత ఆశయాల దారి వదలని బాటసారి అనీ, ఐదురకాల ప్రమాణాలతో కవితలు రాసారని విశ్లేషించారు. తన చుట్టూ జరిగే ఘటనలపై స్పందిస్తూ, అంతర్మధన ఘర్షణకు అక్షరరూపం ఇచ్చారని అన్నారు. కవిత్వాన్ని కరవాలంగా మార్చి బతుకుకోసం పోరాడదాం అనే సందేశాన్ని ఆనందాచారి ఈ పుస్తకం ద్వారా ఇచ్చారని తెలిపారు. పుస్తక రచయిత ఆనందాచారి మాట్లాడుతూ బంధాలు, అనుబంధాలను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తనలోని ఆవేశం కవిత్వ రూపంలో, తాను ఎంచుకున్న మార్గంలో ఉన్నదని చెప్పారు. మార్స్కిజం ఇచ్చిన బాటలోనే వెళ్తున్నామనీ, ప్రపంచాన్ని ఏ మార్గంలో తీసుకెళ్లాలో కూడా అదే నిర్దేశించిందన్నారు. తాను రాసిన ప్రేమ కవిత్వం సమాజంలో జరుగుతున్న విరుద్ధ సంఘటనల ప్రేరణతో వచ్చిందేనని తెలిపారు. పుస్తకావిష్కరణ అనంతరం దానిని రచయిత తన సోదరుడు కటుకోజ్వల నాగేశ్వరరావు, వదిన సుజాతకు అంకితం ఇచ్చారు. అంతకుముందు అతిధులను రాంపల్లి రమేష్ వేదికపైకి ఆహ్వానించారు. కవి తంగిరాల చక్రవర్తి వందన సమర్పణ చేశారు. అనంతోజు మోహనకృష్ణ, సలీమ, నరేష్ సమన్వయం చేశారు.