Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారమవుతుందని చెప్పుకుంటే మానేయమంటూ హుకుం
- నాలుగు జిల్లాల్లో ఆర్‌బీఎస్‌కె డ్రైవర్లకు తప్పని తిప్పలు
- ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న కుటుంబాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒక ఉదాత్త లక్ష్యం కోసం నిర్దేశించిన పథకాలను ఉన్నతాధికారుల నిర్లక్ష్యం నీరుగారుస్తున్నది. చికిత్స కన్నా నివారణ ముఖ్యమంటూ నిపుణులు చేసిన సూచనలు అమలు చేయడంలో భాగంగా అప్పుడే జన్మించిన శిశువు నుంచి 18 ఏండ్లలోపు వారికి ముందుగానే పరీక్షలు చేసి రోగాలను ప్రాథమిక దశలో గుర్తించడం లేదా అవి రాకముందే అప్రమత్తం చేసేందుకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కె)ను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అంగన్ వాడీ కేంద్రాలు, పాఠశాల, కళాశాలల విద్యార్థులను ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా 300 వాహనాలు నిరంతరాయంగా పని చేస్తున్నాయి. అద్దె వాహనాలతో కార్యక్రమాన్ని నడుపుతూ ఒక్కో డ్రైవర్‌కు నెలకు రూ.34,000 (డీజిల్ ఖర్చుతో కలుపుకుని) చెల్లిస్తున్నారు.
2016లో డీజిల్ లీటర్‌కు రూ.52 ఉన్న సమయంలో వారికి రూ.26,000 చెల్లించే వారు. ప్రస్తుతం దాని ధర లీటర్‌కు రూ.110 కాగా వారికి రూ.34,000 మాత్రమే చెల్లిస్తుండటంతో పెరిగిన రేట్లకు అనుగుణంగా పెంచాలని కోరుతున్నారు. సంబంధిత జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. గత రెండేండ్లుగా కోవిడ్-19 మహమ్మారి దశల వారీగా విరుచుకుపడటంతో పాఠశాలల ఆరోగ్య కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ వాహనాలు మాత్రం టీకాల సరఫరా, టెస్టులు, నమూనాలను మోసుకెళ్తూ కరోనా నుంచి ప్రజలను కాపాడటంలో కీలక పాత్ర పోషించాయి. కోవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత దాదాపు 10 నెలల క్రితం రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో వ్యాక్సిన్ల సరఫరా, ఇతర వైద్యసంబంధిత అవసరాల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖలోని వాహనాలను వాడుతున్నారు. నల్లగొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లోని 37 వాహనాలను మాత్రం స్కూల్ హెల్త్ ప్రోగ్రాంతో పాటు అదనంగా వ్యాక్సినేషన్, టెస్టుల కోసం వాడుతుండటంతో డ్రైవర్లకు భరించరాని భారంగా మారింది. కేవలం పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలకు వాహనాలను తిప్పిన సమయంలోనే ప్రతి నెలా 1,000 నుంచి 1,200 కిలోమీటర్లు తిరిగితే డీజిల్ ఖర్చు రూ.13 వేల నంచి రూ.15 వేల వరకు వచ్చేదని తెలిపారు. అదనపు పనితో అది కాస్తా ప్రతి నెల రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వస్తున్నదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వాహనాన్ని కొంత కాలం పాటు హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ తీసుకెళ్లడానికి వాడుకున్నారు. ప్రస్తుతం ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం తిప్పుతుండటంతో అదనంగా డీజిల్ ఖర్చు, ఇతర ఇబ్బందులు తలెత్తుతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ, కరీంనగర్ వాహనాలను ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి వ్యాక్సిన్ తెప్పించేందుకు తిప్పుతున్నారు. ఇక సూర్యాపేట జిల్లాలో బుధ, శనివారాల్లో రెగ్యులర్ వ్యాక్సినేషన్ కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో స్కూల్ హెల్త్ ప్రోగ్రాంతో పాటు అదనంగా పనులు చెబుతుండడంతో ఇప్పటికే డ్రైవర్లు ఆయా వైద్యాధికారులకు మౌఖికంగా, లిఖితపూర్వకంగా అదనపు పని భారం నుంచి తప్పించాలని కోరారు. న్యాయం చేయాల్సిన అధికారులే...ఇష్టం లేకపోతే మానేయమంటూ బెదిరిస్తున్నారని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి తగిన స్పందన రాకపోవడంతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద 2021-22లో 18,49,887 మందిని పరీక్షించి 15,98,826 ఆరోగ్య సమస్యలున్ననట్టు గుర్తించారు. 1,91,547 మందికి అక్కడికక్కడే చికిత్సనందించి 64,514 మందికి పెద్దాస్పత్రులకు రెఫర్ చేశారు. ఈ లెక్కన ఆర్‌బీఎస్‌కె ముందుగానే రోగాలను పసిగట్టడం, స్వల్ప చికిత్సలతో నయం చేయటానికి ఉపయోగపడుతున్నది. అలాంటి కార్యక్రమాన్ని మరింత ప్రోత్సాహం అందించాల్సిన అధికారులు ఆ వాహనాలను ఇతరత్రా మళ్లించడం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
ఎందుకిలా?....
ఇమ్యూనైజేషన్, వ్యాక్సినేషన్ కార్యక్రమాల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వద్ద ప్రత్యేక వాహనాలున్నాయి. ఆ వాహనాలు మరమ్మతులకు వస్తే వెంటనే రిపేర్ చేయించి వాడుకోవాల్సి ఉంటుంది. అయితే వాటిని ఉపయోగించుకుంటున్నట్టు నిధులు కాజేస్తూ ఆ స్థానంలో ఆర్‌బీఎస్‌కె వాహనాలను ఉపయోగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, కుటుంబాలు అప్పుల పాలు కాకుండా, రోడ్డున పడకుండా కాపాడాలని డ్రైవర్లు ఈ సందర్భంగా కోరుతున్నారు.