Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాదగిరి గుట్టలో రెండు గంటలపాటు ఆందోళన
- ఆలయ ఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి కొండ పైకి ఆటోలకు అనుమతివ్వాలన్న డిమాండ్‌తో కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న కార్మికులు.. ఆదివారం పెద్దఎత్తున ధర్నా చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రధానాలయం ప్రారంభమైనప్పటి నుంచి కొండపైకి ఆటోలు అనుమతించకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ఇప్పుడు ఆటోలను అనుమతివ్వకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నామని వాపోయారు. వెంటనే కొండపైకి ఆటోలను అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. ఒక నియంతలా పనిచేస్తున్న దేవస్థానం ఈవోను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సుమారు రెండు గంటల పాటు వైకుంఠద్వారం వద్ద ఆటో కార్మికులు బైటాయించారు. ఆదివారం సెలవు దినం కావడంతో సందర్శకులు పెద్దఎత్తున తరలివచ్చారు. అయితే, ఆటో కార్మికుల ధర్నాతో ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో పట్టణ ఇన్‌స్పెక్టర్ జానకిరెడ్డి వారికి నచ్చజెప్పారు. సమస్యలను అధికారులకు చెప్పి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.