Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా జర్నలిస్టుల ముగింపు సభలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వార్తలు రాసే జర్నలిస్టులు 'కోర్' విలువలు పాటించాలని శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని టూరిజం ప్లాజాలో మహిళా జర్నలిస్టుల రెండురోజుల వర్క్‌షాపు ముగింపు సభలో ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ 'కోర్ లో సి అంటే క్రెడిబిలిటీ, ఓ అంటే ఆబ్జెక్టివీటీ (విషయం), ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ఈ అంటే ఎతిక్స్ (విలువలు), ఇవన్నీ ఉంటేనే ఆ వార్తకు సంపూర్ణత వస్తుంద'ని జర్నలిస్టులకు సూచించారు. ఒక వ్యక్తి గురించి రాసేముందు ఆ వ్యక్తి అభిప్రాయం తెలుసుకునే మర్యాదను పాటించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కొత్తగా నిర్మాణం జరుగుతున్న సచివాలయంలో మహిళా జర్నలిస్ట్‌లకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలను నియమించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు నిధులు ప్రకటించి, ఇప్పటివరకు రూ. 42 కోట్లు విడుదల చేసి దానిపై వచ్చిన వడ్డీతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నాలుగువేల మంది జర్నలిస్టులకు ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్టు వివరించారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా న్యాయమైన గొంతు వినిపిస్తే దాన్ని ఆపడానికి 'టె క్ ఫాక్స్' ద్వారా దానికి వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి ఆమెను అణిచేందుకు ప్రయత్నిస్తున్నారనీ, ఇది దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న సంక్లిష్ట పరిస్థితుల్లో మరింత ఆత్మస్థైర్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.విలేకరి అనేవాడు కిట్ టూ రన్(వార్త రాయడం అక్కడ పడేసి పోవటం) అనే పద్దతుల్లో ఉండకూడదని సూచించారు. ఎవరు రాసిన వార్తకు వారే బాధ్యత వహించటం ఉత్తమ జర్నలిస్టు లక్షణమని తెలిపారు. శాసన మండలి సభ్యురాలు వాణి దేవి మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులకు మగవారి కున్న స్వేచ్ఛ, వెసులుబాటు లేకున్నా పట్టుదలతో ప్రతి అడ్డంకిని అధిగమించి తమ విధులను నిర్వహిస్తే మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా తన తండ్రి, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పత్రిక నడిపిన తీరును వివరించారు. జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్ట్ ధన్య రాజేంద్ర మాట్లాడుతూ తెలుగులో మహిళ ప్రాధాన్యమున్న మీడియా సంస్థలు రావాలన్నారు. విశ్వసనీయత ఉన్న వార్తలు భయం లేకుండా రాయాలని సూచించారు. మరో సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ మాలిని సుబ్రమణ్యం మాట్లాడుతూ తాను చత్తీగడ్, బస్తర్ జిల్లాల్లో గిరిజనుల జీవన విధానం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఏ విధంగా అడ్డుకుని మళ్లీ రాకుండా ప్రయత్నించిన విషయాన్ని వివరించారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అతిధులను పరిచయం చేస్తూ రెండు రోజుల మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ అద్భుతంగా జరిగిందనీ, దీని జయప్రదానికి కృషి చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు. వర్క్ షాప్‌లో పాల్గొన్న మహిళా జర్నలిస్టులకు అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ మహిళా జర్నలిస్టులు కట్ట కవిత, సుమబాల ,స్వేచ్ఛ నిర్వహించారు.