Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి ఎన్ ఈసీసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మనుషులు ఉపయోగించుకునేందుకు వీల్లేకుండా పాడైన గోధుమలు, వరి ధాన్యం, బియ్యాన్ని రెండు మిలియన్ టన్నుల మేర కోళ్ల దాణాకు ఉపయోగించుకునేందుకు కేటాయించాలని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌ఈసీసీ) కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. కోళ్ల దాణాగా ఉపయోగించే మొక్కజొన్నల ధరలు బహిరంగ మార్కెట్లో విపరీతంగా పెరగడం, మొక్కజొన్న, సోయాను ఆహారంగా తీసుకునే అలవాటు ఇండ్లలో పెరగడంతో చరిత్రలో ఎన్నడూ లేనట్టు కోళ్ల పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని తెలిపింది. మక్కలను ఎగుమతి చేసుకునే అవకాశం దొరకడం, బీహార్‌లో దానిని జీవ ఇంధన తయారీలో ఉపయోగించడం తదితర కారణాలతో ధరలు పెరిగాయని ఎన్‌ఈసీసీ వెల్లడించింది. దీంతో గతేడాది టన్ను మొక్కజొన్నలు రూ.18 వేలుండగా ఈ ఏడాది దాదాపు రూ.25 వేలకు ధర పెరిగిందనీ, అది కాస్తా రూ.30 వేలకు పెరగగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ధరల పెరుగుదల ప్రభావంతో గతేడాది ఒక గుడ్డు ఉత్పత్తి ఖర్చు రూ.4 నుంచి రూ.4.75కు పెరిగి ప్రస్తుతం రూ.5 చేరిందని తెలిపింది. ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక ఇప్పటికే కొంత మంది తమ పరిశ్రమలను మూసుకోగా, మరికొంత మంది ఉత్పత్తిని తగ్గించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కోళ్ల పరిశ్రమను బతికేంచేందుకు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎన్‌ఈసీసీ కోరింది.