Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఆపరేషన్ విభాగాల సమన్వయం
- ఆయా రాష్ట్రాల పోలీసులతో కోఆర్డినేషన్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాల్లో డ్రగ్స్ రవాణా పెరగటంపై కేంద్రానికి చెందిన వివిధ ఆపరేషన్ విభాగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ డ్రగ్స్ రవాణాను నియంత్రించడానికి కేంద్రానికి చెందిన వివిధ ఆపరేషన్ విభాగాల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. ముఖ్యంగా, నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఆర్‌ఐ), సెంట్రల్ ఎక్సైజ్ విభాగల మధ్య సమన్వయ కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలిసింది. ఇటీవలి కాలంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో గంజాయి పంటల సాగు పెద్ద ఎత్తున సాగటంతో పాటు వేలాది క్వింటాళ్లలో సరఫరా సాగుతున్నదని కేంద్ర ఆపరేషన్ విభాగాలకు సమాచారమున్నట్టు తెలిసింది.
వీటితో పాటు నల్లమందు, ఎండీఎంఏ, చరస్, హషీశ్, మార్ఫిన్ వంటి మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, వినియోగం, తదితర వ్యాపారాలు కోట్లాది రూపాయల్లో సాగుతున్నదని దర్యాప్తు సంస్థల దృష్టిలో ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా, గోవా నుంచి రహస్యంగా ఈ సరఫరా సాగుతున్నదనీ, అంతేగాక విదేశాల నుంచి కూడా స్మగ్లర్లు దిగుమతి చేసుకుంటున్నట్టు ఈ సంస్థల పరిశీలనలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో విస్తృతమవుతున్న మాదక పదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేయడానికీ, డ్రగ్ మాఫియా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడానికి ఈ సంస్థలు సమాయత్తమవుతున్నాయని సమాచారం. దీనికి సంబంధించి నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలు వాటి దారిలో ఆపరేషన్‌ను సాగిస్తున్నాయి. మరోవైపు, ఆయా రాష్ట్రాల నార్కొటిక్ కంట్రోల్ విభాగాల పోలీసులు డ్రగ్స్ కంట్రోల్‌కు ఆపరేషన్‌ను సాగిస్తూ కొంత ఫలితాలు రాబడుతున్నప్పటికీ చాప కింద నీరులా డ్రగ్ మాఫియా కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని మరింత కట్టుదిట్టంగా కట్టడి చేయడానికిగానూ కేంద్ర ఆపరేషన్ విభాగాల మధ్య మరింతగా సమన్వయాన్ని పెంచుతున్నారు. ఒకవైపు నిఘా, మరొకవైపు ఆపరేషన్స్ విభాగాలను మరింత పటిష్టపర్చడమేగాక డ్రగ్ మాఫియాపై వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు సాగాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై త్వరలోనే కోఆర్డినేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.