Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30లక్షల ఎకరాల్లో నష్టపోయారు
- వారికి ధైర్యం ఇవ్వడానికే రాహుల్ సభ : విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వరి పంట వేయొద్దని చెప్పడం ద్వారా సీఎం కేసీఆర్ రైతులను ముంచారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. కేసీఆర్ మాట నమ్మి 30 లక్షల ఎకరాల్లో వారు వరి పంట వేయలేదనీ, మరో పంట సాగు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారనీ, వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ ఆడిన డ్రామాలతో రైతులకు తక్కువ ధరకు అమ్ముకున్నారని చెప్పారు. దీంతో వారికి నష్టం జరిగిందనీ, మిల్లర్లు లబ్దిపొందారని చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ అసెంబ్లీలోని కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) కార్యాలయంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మెన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, సీనియర్ నేత కోదండరెడ్డి సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో నష్టపోతున్న రైతులకు ధైర్యం ఇవ్వడానికి వచ్చే ఆరున వరంగల్‌లో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు ఆనందంగా లేరని చెప్పారు. అందుకనే రైతులకు మానసికంగా ధైర్యం వారికి కల్పించేందుకే సభ నిర్వహించామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవసాయ ఆధారితంగా ఆర్థికంగా రైతులు ఎదగడం కోసం ఎలాంటి పథకాలు అమలు చేశాయో, వాటిని వివరిస్తూ భవిష్యత్తులో అలాంటి పథకాలతో రైతులను ఆదుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల్లో ప్రకటించామని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించారు.దాన్ని అమలు చేయకపోవడం వల్ల లక్ష రూపాయల రుణానికి వడ్డీ మీద వడ్డీ పెరిగి నాలుగు లక్షలకు చేరుకుందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులకు లక్ష లోపు వడ్డీలేని రుణం, మూడు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు వ్యవసాయ యంత్ర పరికరాలు డ్రిప్స్, స్ప్రంకర్లు, పందిరి సాగు కోసం 100 శాతం సబ్సిడీ ఇచ్చామని చెప్పారు. రైతుబంధు తీసుకొచ్చి వ్యవసాయాన్ని పండగ చేస్తున్నామని సీఎం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎరువుల ధరలు పెంచడంతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచుతామని గొప్పలు చెప్పిన బీజేపీ...ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్ సర్కారు రైతుల నుంచి బలవంతంగా గుంజుకుంటున్న అసైన్డ్‌భూములపై వరంగల్ సభలో తమ అధినేత రాహుల్ గాంధీ వివరిస్తారని వెల్లడించారు. సభకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజకీయాలకతీతంగా రైతులు, విద్యార్థి, యువజన, కూలీలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తరలించాలనీ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జిగేష్ మేవాని అరెస్టుకు సీఎల్పీ ఖండన
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ దళిత శాసనసభ్యులు జిగేష్ మేవాని ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేసినందుకు ఆయన్ను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను బీజేపీ హరిస్తుందనీ, దళితులు కేంద్రంలోని బీజేపీకీ బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు.
డీసీసీ అధ్యక్షుడికి షోకాజ్
మరోవైపు జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌చార్జి మాధన్‌మెహన్‌రావును డీసీసీ అధ్యక్షులు సస్పెండ్ చేయడాణ్ని టీపీసీసీ సీరియ స్‌గా పరిగణించింది.రాష్ట్ర నాయకున్ని సస్పెండ్ చేసే అధికారం డీసీసీ అధ్యక్షుడికి లేదని తేల్చింది.ఈమేరకు టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ జిల్లా అధ్యక్షుడికి షోకాజ్ నోటీ సు జారీ చేసినట్టు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.
పీకే చేరికపై అధిష్టానానిదే నిర్ణయం : కోమటిరెడ్డి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్‌లో చేరిక, ఇతర పార్టీలతో పొత్తుల అంశానికి సంబంధించిన తుది నిర్ణయం అధిష్టానానిదేనని కాంగ్రెస్ స్టార్ క్యాపెంయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం లేదనీ, రాహుల్‌గాంధీ సభపైనే దృష్టి సారించామన్నారు. జిల్లాల వారీగా బలమైన నేతలున్నారనీ, వారే జనసమీకరణ చేస్తారని చెప్పారు. సన్నాహక భేటీలు ఏర్పాటు చేస్తారని వివరించారు. అంతా మేమే చేస్తామంటే కుదరదనీ, ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.