Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగణ బ్యూరో - హైదరాబాద్
మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఈ నెల 26న సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నిరుపేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతో పాటు, అలాంటి వైద్యవిద్యను బలోపేతం చేసేందుకు ఆధునాతన దవాఖానాలు ఉపయోగపడతాయని తెలిపింది. ఈ మూడింటి నిర్మాణానికి ఇప్పటికే రూ.2,679 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రోగుల సంఖ్య పెరిగినా ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ధర్మాస్పత్రులపై భారం పెరిగినా ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క పెద్దాస్పత్రిని నిర్మించలేదని వైద్యశాఖ విమర్శించింది. ఒక్కో దవాఖానాను 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించి, వెయ్యి పడకలను ఏర్పాటు చేస్తారు. వీటితో వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అల్వాల్‌లో ఆస్పత్రిని 28.41 ఎకరాల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్, ఐదంతస్తుల భవనాన్ని, ఎల్బీనగర్‌లో 21.36 ఎకరాల్లో గ్రౌండ్ ఫ్లోర్, 14 అంతస్తుల భవనాన్ని, సనత్ నగర్‌లో 17 ఎకరాల్లో గ్రౌండ్ ఫ్లోర్ 14 అంతస్తుల భవనాన్ని నిర్మించనన్నారు.