Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తక్కువ ధరకు ప్రయివేటుకు అమ్ముకుంటున్న రైతులు
- కొనుగోలు కేంద్రాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోలు నుంచి తప్పుకొని కేంద్రం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. కొనుగోలు చేస్తామని చెప్పిన రాష్ట్రం పూర్తిస్థాయిలో అందుకోసం ఏర్పాట్లు చేయకపోవడంతో కష్టాలు తప్పడం లేదు. యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్త నడకలా సాగుతుండటంతో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు ప్రయివేటు వ్యక్తులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. దీనిని నుంచి రైతులను గట్టెక్కించాలంటే వెంటనే లక్ష్యం మేరకు అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్రానిదే బాధ్యత
గతేడాది యాసంగితో పోలిస్తే ఈ ఏడాది 17 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. 53 లక్షల ఎకరాల్లో 70 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా. కొనుగోలుకు కేంద్రం నిరాకరించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తమవుతున్నది. ధాన్యం కొనుగోలు, పంపిణీ కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత. అయినప్పటికీ దాని నుంచి తప్పుకున్నది. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 2005 వరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైస్ మిల్లర్లతో నేరుగా మాట్లాడి కొనుగోలు చేసేది. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఎఫ్‌సీఐ కొనుగోలుతో ఆలస్యమవుతుందనీ, రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్ సర్కారు దాన్ని కొనసాగించింది. తాజాగా ఉప్పుడు బియ్యం కొనుగోలు, పంపిణీ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకోవడం, సన్నధాన్యాన్ని రైస్ మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. రైస్ మిల్లర్లకు అప్పగించేందుకు ఆరబెట్టి, నింపి తీసుకురావాల్సి ఉంటుంది. రైస్ మిల్లర్లు కొనేదాంట్లో ఎక్కువగా సోనామసూరి ఉంటున్నది. ఎ గ్రేడ్ రకానికి రూ.1,960, బి గ్రేడ్ రకానికి రూ.1,940 గా మద్ధతు ధర నిర్ణయించారు. అయితే ధాన్యం కొనుగోలు కోసం ఏప్రిల్ 14నే ప్రారంభమైనప్పటికీ నిర్దేశిత 6,983 కేంద్రాలకుగానూ కేవలం వెయ్యి కేంద్రాల్లోనే కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పండిన ధాన్యాన్ని నిల్వ ఉంచుకోలేని రైతు వాటిని ప్రయివేటుకు అమ్ముకుంటుండటంతో మద్ధతు ధర దక్కడం లేదు. దీంతో కేవలం రూ.1,500 నుంచి రూ.1,600కే క్వింటాలు ధర పలుకుతుండగా, దీనికి తోడు రవాణా ఖర్చులు, కొరత, తరుగు పేరుతో అదనపు భారం పడుతున్నది. ఇక ప్రభుత్వ కేంద్రాల్లో అమ్ముకుంటున్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో క్వింటాలుకు తరుగు పేరుతో నాలుగు కిలోలను తగ్గిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కనీసం ఐదు ఎకరాల్లో ధాన్యం పంటకు రూ.10 వేల చొప్పున నష్టపోతున్నారు.
అకాల వర్షాలు..సౌకర్యాల లేమి
కొనుగోళ్లలో వేగం పెంచకపోతే రైతు మరింత నష్టపోయే పరిస్థితి కనిపిస్తున్నది. ఇటీవల మహబూబ్ నగర్ - జడ్చర్ల ప్రాంతంలో కురిసిన వర్షం దెబ్బతీసింది. రాష్ట్రంలో అకాల వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరిస్తూనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన హమాలీ చార్జీలను క్వింటాలుకు రూ.25 నుంచి రూ.40 రైతు నుంచే వసూలు చేస్తున్నట్టు సమాచారం. ధాన్యాన్ని సేకరించడానికి 15 కోట్ల గోనె సంచులు అవసరం కాగా ప్రభుత్వం వద్ద 1.6 కోట్లు ఉన్నాయి. మరో ఆరు కోట్ల కోసం టెండర్లు పిలిచినట్టు అధికారులు ప్రకటించారు. కేంద్రం మూడు కోట్ల సంచులు సరఫరా చేస్తామని తెలిపినప్పటికీ అవి ఇంకా రానేలేదు. దీంతో కొనుగోళ్లకు అడ్డంకులు ఏర్పడుతున్నట్టు తెలుస్తున్నది. కొనుగోలు చేసిన రైతులకు రసీదు ఇచ్చిన తర్వాత జమాలో ఐదు నుంచి 10 శాతం తగ్గిస్తున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా తగ్గించిన రైతుల సొమ్ము ఉదాహరణకు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోనే రూ.10 కోట్ల వరకుంది. కొనుగోలు కేంద్రాలను పెంచడంతో పాటు సౌకర్యాలను కల్పించాలని పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సకాలంలో ప్రారంభించాలి .....టి.సాగర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుకు ముందుకు రావడాన్ని ఆయన ఆహ్వానించారు. ఐకేపీ, సహకార సంఘం కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. వెంటనే స్పందించకుంటే అకాల వర్షాల వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.