Authorization
Sat May 17, 2025 05:39:14 am
- మిల్లర్ పేలి చెలరేగిన మంటలు
- ఆరుగురు కార్మికులకు అంటుకున్న మంటలు
- నలుగురి పరిస్థితి విషమం
నవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గూపురం మండలం చేల్పూర్‌లోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ)లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేటీపీపీలోని మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు జేపీఏ కార్మికులకు మంటలు అంటుకోగా.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... కేటీపీపీలోని మొదటి యూనిట్‌లోని 500 మెగావాట్ల ప్లాంట్‌లోని ఏ మిల్లర్ రిపేర్‌కు వచ్చింది. దాంతో పాల్వంచ నుంచి రిపేరు చేసేందుకు కార్మికులను పిలిపించారు. వారితో పాటు మరికొంతమంది కార్మికులు కలిసి రిపేర్ చేసుకుండగా.. బీ మిల్లర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో జేపీఏ కార్మికులైన జానకిరామ్, మహేందర్, వెంకటేశ్వర్లు, సీతారాములు, రాజాలు, సాయికుమార్ మంటల్లో చిక్కుకొని గాయపడ్డారు. పక్కనే ఉన్న తోటి కార్మికులు గుర్తించి మంటలు ఆర్పి వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కేటీపీపీ అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కార్మికులకు సేఫ్టీ పరికరాలు అందించకపోవడం వల్లే వారు గాయపడినట్టు సమాచారం. గాయపడిన కార్మికులంతా పాల్వంచ నుంచి వచ్చినవారే.