Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రూప్-1లో 900 మార్కులకు, గ్రూప్-2లో 600 మార్కులకు ...
- తెలుగు, ఆంగ్లంతోపాటు ఉర్దూ భాషల్లో రాతపరీక్షలు
- పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానం ఖరారు
- రాతపరీక్షల ఆధారంగానే నియామకాలు
- విధివిధానాలు ప్రకటించిన ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విధానంపై ప్రభుత్వం విధివిధానాలను ప్రకటించింది. పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని సాధారణ పరిపాలన శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో గ్రూప్-1 సహా పలు కొలువుల సాధనకు ప్రతిభ ప్రామాణికం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1లో 19 రకాల పోస్టులు, గ్రూప్-2లో 16 రకాల పోస్టులు, గ్రూప్-3లో ఎనిమిది రకాల పోస్టులుంటాయని వివరించారు. గ్రూప్-1 పోస్టులకు 900, గ్రూప్-2 పోస్టులకు 600, గ్రూప్-3 పోస్టులకు 450 మార్కులకు రాతపరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులకు 300 మార్కులతో రాతపరీక్ష నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. గ్రూప్-1, గ్రూప్-2 సహా గెజిటెడ్ పోస్టులకు ఇంటర్వ్యూ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ, మెయిన్స్ రాతపరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ప్రిలిమినరీకి హాజరైన వారిలో ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్‌కు మల్టీ జోన్ల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆదారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో అన్ని పోస్టులకూ రాతపరీక్షలను నిర్వహిస్తామని వివరించారు. అలాగే గ్రూప్స్ విభాగంలో భర్తీకాని ఇతర ఉద్యోగాలకు ప్రత్యేక పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. గ్రూప్స్‌తోపాటు గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, సూపర్‌వైజర్, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్, సీనియర్ రిపోర్టర్, ఇంగ్లీష్ రిపోర్టర్ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానాలను ఖరారు చేశామని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలకు మార్గం సుగమమైంది. ఈ వారంలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కసరత్తు చేస్తున్నది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.