Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనక్కి వెళ్తున్న రోగులు
- టెస్టులకు, చికిత్సకు రోజుల తరబడి ఎదురుచూపులు
- భరించలేక ప్రయివేటును ఆశ్రయిస్తున్న బాధితులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఆస్పత్రుల్లో నిమ్స్ ఒకటి. అరుదైన రికార్డులను సొంతం చేసుకున్న ఘనత ఆ ఆస్పత్రిది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పలు సంక్లిష్టమైన కేసులకు స్థానిక వైద్యులు నిమ్స్ కు వెళ్లాలని సిఫారసు చేస్తుండటంతో రోగుల రద్దీ ఎక్కువగా ఉంటున్నది. అయితే ఆ వచ్చే రోగులందరికి వెంటనే పరీక్షలు చేసి చికిత్సనందించే పరిస్థితి లేకపోవడంతో పలువురు నిరాశతో వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇలా వెళ్లిన రోగుల్లో ఎక్కువ మట్టుకు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇలా వెళ్లిపోతున్న రోగుల్లో దాదాపు అన్ని విభాగాలకు చెందిన వారుంటున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారనీ, పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, పెరిగిన పేషెంట్లకు తగినట్టు డాక్టర్లు, నర్సింగ్, పారామెడికల్ ఇతర సిబ్బందిని పెంచకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని ఉద్యోగులు చెబుతున్నారు.
ఆస్పత్రిలోని కార్డియాలజీ విభాగంలో శస్త్రచికిత్స కోసం చేరిన రోగులకు వెంటనే చికిత్స చేసే పరిస్థితి కనిపించడం లేదు. శస్త్రచికిత్స కోసం తేదీని, సమయాన్ని నిర్ణయించినప్పటికీ ఆ సమయానికి అత్యవసర కేసులు వచ్చాయని చెబుతూ వాయిదా వేస్తున్నట్టు రోగుల సహాయకులు చెబుతున్నారు. వరంగల్‌కు చెందిన ఒక హద్రోగి సైతం స్థానిక డాక్టరు సిఫారసుతో నిమ్స్‌లో చేరారు. ఆరోగ్యశ్రీ ఆమోదం లభించింది. అయినప్పటికీ ప్రతి రోజూ ఆపరేషన్ చేయకుండా వాయిదా వేయడం, అదే విషయాన్ని సంబంధిత డాక్టర్లను రోగుల సహాయకులు అడిగితే, అత్యవసర కేసులొస్తున్నాయి.... వాటిని ముందు చూడాలని బదులిస్తున్నట్టు వాపోయారు. దీంతో ఆ రోగిని హైదరాబాద్‌లోని పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి శస్త్రచికిత్స చేయించారు.
హన్మకొండ జిల్లాకు చెందిన మరో రోగిని కడుపు ఉబ్బి నొప్పి పెరగడంతో నిమ్స్‌కు తరలించారు. గంటల కొద్దీ వేచి చూసినా చికిత్స చేయకపోవడం, రోగుల సహాయకులు ఏది అడిగినా సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ రోగిని తిరిగి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అత్యంత నిర్లక్ష్యంగా నిమ్స్ సిబ్బంది తమతో వ్యవహరించారనీ, పట్టించుకుంటారనే నమ్మకం పోవడంతో వేరే ఆస్పత్రిలో చూపించుకునేందుకు వెళుతున్నామని రోగి బంధువులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గర్భిణీ కడుపులో బిడ్డకు గుండె, మూత్రపిండాలు పాడయ్యాయయని గుర్తించి నిలోఫర్ ఆస్పత్రిలో అబార్షన్ చేశారు. అయితే భవిష్యత్తులో మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ముందు జాగ్రత్తగా ఆ ఆస్పత్రి డాక్టర్లు డీఎన్‌ఏ స్టోరేజ్ నమూనా కోసం నిమ్స్‌కు సిఫారసు చేశారు. అయితే నిమ్స్ సిబ్బంది మాత్రం ఆ నమూనా సేకరించేందుకు నిరాకరించారు. నిమ్స్‌కే రాశారని రోగుల సహాయకులు ప్రిస్క్రిప్షన్ చూపించినప్పటికీ, నిలోఫర్ ఆస్పత్రి డాక్టర్లనే ఎందుకు రాశారో అడగాలంటూ దురుసుగా సమాధానమిచ్చి పంపించేశారు. ఇవి కేవలం ముగ్గురు రోగులు నిమ్స్‌లో ఎదుర్కొన్న అనుభవాలకు సంబంధించిన ఉదాహరణలు మాత్రమే. కానీ, ప్రతి రోజూ నిమ్స్‌లో ఇలాంటివి పదుల సంఖ్యలో ఉంటున్నట్టు తెలుస్తున్నది. పెరిగిన రోగుల రద్దీకి తగినట్టు తక్షణం డాక్టర్లు, సిబ్బందిని పెంచకుండా ప్రభుత్వం ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉండదని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రోగులకు సేవలందించేందుకే తామున్నామనీ, అయితే తమ సామర్థ్యానికి మించి మూడింతలు, నాలుగింతలుగా రోగులు వస్తున్నారని వారు చెబుతున్నారు. ఏండ్ల తరబడి స్టాఫ్ సంఖ్య పెంచకుండా కొనసాగిస్తుండటమే ఈ పరిస్థితికి కారణమనీ, వెంటనే సౌకర్యాలు, సిబ్బందిని మెరుగుపరిస్తే నిమ్స్ పూర్వపు ప్రతిష్టను కొనసాగించగలుగుతుందని సూచిస్తున్నారు.