Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా వెల్లడి
- ఓయూ వీసీ రవీందర్‌కు ఉత్తర్వులు అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఉన్నత విద్యలో మహిళలు ముందంజలో ఉండాలనే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు కోసం ప్రోత్సహించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి అధికారులతో సబితా ఇంద్రారెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే వందేండ్లు పూర్తి చేసుకోబోతున్న కోఠి మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తున్నామని అన్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) వీసీ డి రవీందర్‌కు మంత్రి అందజేశారు. మహిళా వర్సిటీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.వంద కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన కోర్సులను ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విశ్వవిద్యాలయంలో అవసరాలు, నియామకాలకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రికి మంత్రి సూచించారు. తెలంగాణ మహిళా విద్యార్థుల కళ ఇప్పుడు సాకారమైందన్నారు.
దీంతో తెలంగాణ ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరగనుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు. బోధనా సౌకర్యాలు, విద్యార్థినులకు కావాల్సిన వసతులు, మౌలిక సదుపాయాలను సత్వరమే కల్పించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచే తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం తన బాధ్యతలను నిర్వర్తిస్తుందని అన్నారు. అందుకనుగుణంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, ఓయూ వీసీ రవీందర్, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ విద్యులత తదితరులు పాల్గొన్నారు.
మహిళా వర్సిటీగా కోఠి మహిళా కళాశాల : ఉత్తర్వులు జారీ
హైదరాబాద్‌లోని కోఠిలో ఉన్న మహిళా కళాశాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తున్నట్టు విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఆయన జీవో నెంబర్ 12ను విడుదల చేశారు. మహిళల సాధికారత, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నదని వివరించారు. ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఇచ్చిన సిఫారసుల ప్రకారం కమిటీని నియమించి ఆ కాలేజీని అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం (2022-23) నుంచి బాధ్యతలను నిర్వర్తిస్తుందనీ, అందుకనుగుణంగా తెలంగాణ యూనివర్సిటీల యాక్ట్-1991ను సవరించామని పేర్కొన్నారు. కొత్త కోర్సులు, కొత్త డిపార్ట్‌మెంట్లను అందుబాటులోకి తేవాలంటూ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఆ వర్సిటీకి అవసరమైన బోధన, బోధనేతర సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. అవసరమైన ఆర్థిక సహకారం ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. మహిళా కళాశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందిని, మౌలిక వసతులు, ఆస్తులను మహిళా వర్సిటీకి బదలాయిస్తున్నామని వివరించారు. పరిపాలన నియంత్రణ ఓయూ నుంచి కొత్తగా ఏర్పాటయ్యే మహిళా వర్సిటీకి మారుతుందని తెలిపారు.