Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోడు సాగుదారులకు కొత్త పాసు పుస్తకాలివ్వాలి
- తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
- రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు
- ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తాండూర్,
- వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నా
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఫారెస్టు భూముల్లో సాగుదారులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు. రైతుల భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూర్ పట్టణాల్లోని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయా కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధరణి సమస్య మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. భూ బదలాయింపు, విరాసత్, మ్యూటేషన్, తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం రైతులు ప్రతిరోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ఫారెస్ట్ భూముల్లో అనేక సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న రైతులకు కొత్త పాస్ పుస్తకాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. వెంటనే పాసు పుస్తకాలు అందజేసి, రైతుబీమా, రైతుబంధు అమలు చేయాలని కోరారు. అలాగే అర్హులందరికీ డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమారపు రవి, మహిపాల్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లేశం, వ్యకాస జిల్లా కార్యదర్శి వెంకటయ్య, నాయకులు అంజి రావణ్, రామకృష్ణ, సతీష్, శ్యామ్, రాములు, అమృతమ్మ, అనాంతి, రాజాలింగం శ్రీనునాయక్, తదితరులు పాల్గొన్నారు.