Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో గల ఎంఎస్‌ధోనీ క్రికెట్ అకాడమీ హైపెర్ఫామెన్స్ సెంటర్‌లో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ప్రముఖ కోచ్ డేవ్ వాట్‌మోర్‌తో సమ్మర్ క్యాంప్ నిర్వహించనున్నారు. మంగళవారం ఈ సమ్మర్ క్యాంప్‌నకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు నాచారంలోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంటర్‌లో శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, డీపీఎస్ (నాచారం, నాదరగుల్), పల్లవి విద్యాసంస్థల సీఓఓ యశస్వి, ఎంఎస్‌డీసీఏ హెడ్ కోచ్ వెంకట్‌రామన్ కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత యశస్వి మాట్లాడుతూ ఎంఎస్‌డీసీఏ ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి మే 21 వరకు డేవ్ వాట్‌మోర్ నేతత్వంలో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల విద్యార్థులే కాకుండా ఇతరులు కూడా ఈ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొనవచ్చునని తెలిపారు. సమ్మర్ క్యాంప్‌లో అడ్మిషన్‌కు రూ7,999 లు చెల్లించాల్సి ఉందని, అయితే, డీపీఎస్, పల్లవి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు 50 శాతం రాయితీతో రూ.3,999లకే అడ్మిషన్ ఇస్తున్నట్టు చెప్పారు. శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలోని ఒక 50 మంది పేద పిల్లలకు, ప్రతిభావంతులైన వర్ధమాన క్రికెటర్లకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు యశస్వి వెల్లడించారు. అనంతరం శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 1996లో వరల్డ్‌కప్ నెగ్గిన శ్రీలంక జట్టుకు, బంగ్లాదేశ్, పాకిస్థాన్, జింబాబ్వే, ఐపీఎల్‌లోని కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లకు కోచ్‌గా సేవలందించిన దిగ్గజ కోచ్ డేవ్ వాట్‌మోర్ హైదరాబాద్‌కు వస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డబ్బులు చెల్లించలేని నిరుపేద క్రికెటర్లకు ఈ సమ్మర్ క్యాంప్‌లో ఉచితంగా ప్రవేశం కల్పించాలని డీపీఎస్ చైర్మన్ కొమరయ్య, యశస్వికి విజ్ఞప్తి చేయడం, వాళ్లు దానికి అంగీకరించడం గొప్ప విషయమని కొనియాడారు. డేవ్ వాట్‌మోర్ ఆధ్వర్యంలో ఎంఎస్‌డీసీఏ నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్‌ను యువ క్రికెటర్లు సద్వినియోగం చేసుకోవాలని వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. ఎంఎస్‌డీసీఏ హెడ్ కోచ్ వెంకట్‌రామన మాట్లాడుతూ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో డేవ్ వాట్‌మోర్ తాను కలిసి పనిచేశామని గుర్తు చేశారు. విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో 2008లో భారత అండర్-19 జట్టు వరల్డ్‌కప్ సాధించడంలో డేవ్ తన వ్యూహాలతో కీలకపాత్ర పోషించినట్టు ఆయన చెప్పారు. తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ క్రికెటర్లకు లభించిన ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వెంకటరామన్ కోరారు.