Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు హైదరాబాద్ హైటెక్స్‌లో ఆవిర్భావ దినోత్సవం
- జిల్లాల నుంచి భారీగా తరలిరానున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
- మొత్తం 11 అంశాలపై తీర్మానాలు
- జాతీయ రాజకీయాలపై మరోసారి గళమెత్తనున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన అధికార టీఆర్‌ఎస్ పార్టీ 20 ఏండ్లు పూర్తి చేసుకుని... 21వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో బుధవారం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేశారు. సభా ప్రాంగణంతోపాటు హైదరాబాద్ నగరాన్నంతటినీ గులాబీ జెండాలు, స్వాగతతోరణాలతో ముస్తాబు చేశారు. టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు వీలుగా సభా ప్రాంగణం వద్ద భారీ కటౌట్లను ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఆవిర్భావ సభ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఈ సభకు హాజరయ్యేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మంది నాయకులకు మాత్రమే పార్టీ నుంచి ఆహ్వానపత్రాలు అందాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మెన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మెన్లు, మేయర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల, డివిజన్ అధ్యక్షులు, జిల్లా గ్రాంధాలయ సంస్థ చైర్మెన్లు, టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్షులను మాత్రమే ప్లీనరీకి ఆహ్వానించారు. గ్రామ శాఖల అధ్యక్షులు, ఇతర నాయకులు ఆయా ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఎగరేసి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. అయితే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాలు పంచుకునేందుకు వీలుగా కిందిస్థాయి శ్రేణుల నుంచి వేలాది మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలి వచ్చే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు వీలుగా సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారు. గులాబీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన తెలంగాణ అమరులకు నివాళులర్పించి ప్లీనరీని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం సీఎం స్వాగతోపన్యాసం చేస్తారు. నాయకుల ప్రసంగాల తర్వాత రాజకీయ తీర్మానాలను ప్రవేశపెడతారు. పార్టీ అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం, తాజా రాజకీయ పరిస్థితులు, కేంద్ర వైఫల్యాలు, నిత్యావసర ధరలు, దేశంలో నిరుద్యోగం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు, వచ్చే సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తదితరాంశాలపై ఈ సభలో చర్చించనున్నారు. జాతీయ రాజకీయాలపై టీఆర్‌ఎస్ దృష్టి, బీజేపీ విధనాలను బాహాటంగా ఎండగట్టడమే కాకుండా ప్రాంతీయ పార్టీలన్నింటితో టీఆర్‌ఎస్ సంప్రదింపులు, సమాలోచన నేపథ్యంలో జరగబోతున్న ఆవిర్భావ దినోత్సవం ఆద్యంతం ప్రాధాన్యతను సంతరిం చుకున్నది. ఆ పార్టీ రాజకీయ వ్యూహాలపై కూడా ఈ సందర్భంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ మరోసారి గళమెత్తనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఏం మాట్లాడతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.