Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీట్ ఆధారంగా యాజమాన్య కోటా సీట్ల భర్తీ:
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా ప్రవేశాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీట్ ర్యాంకుల ప్రకారం బీఎస్సీ నర్సింగ్ యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రక్రియ వచ్చే విద్యాసంవత్సరం (2022-23) నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసిన విలేకర్లతో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ నర్సింగ్ సీట్లను ఎంసెట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కుల ఆధారంగా బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సీట్లను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తున్నదని వివరించారు. ఆయా కోర్సుల ప్రవేశాలను ప్రవేశ పరీక్ష ఆధారంగా భర్తీ చేయాలంటూ భారతీయ నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) విధించిన నిబంధనల మేరకు కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ద్వారా, యాజమాన్య కోటా ప్రవేశాలను నీట్ యూజీ ర్యాంకుల ఆధారంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. 2022-23 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలను ఎంసెట్ ద్వారా భర్తీ చేయాలంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పంపించిన ప్రతిపాదనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం బీఎస్సీ నర్సింగ్ ప్రస్తుత ప్రవేశ నిబంధనలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు బీఎస్సీ నర్సింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ద్వారా, యాజమాన్య కోటా సీట్లను నీట్ యూజీ మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తామని చెప్పారు. బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలను ఎంసెట్ ద్వారా చేపట్టేందుకు ఆరోగ్య వర్సిటీ ఇప్పటికే ఉన్నత విద్య మండలికి లేఖ రాసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో 680 కన్వీనర్ కోటా సీట్లున్నాయని అన్నారు. 81 ప్రయివేటు నర్సింగ్ కళాశాలల్లో 2,766 కన్వీనర్ కోటా సీట్లు, 1,844 యాజమాన్య కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 90 నర్సింగ్ కాలేజీల్లో 5,300 సీట్లున్నాయని చెప్పారు. ప్రయివేటు ఇంజినీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం యాజమాన్య కోటా సీట్లుంటాయని అన్నారు. కానీ ప్రయివేటు నర్సింగ్ కాలేజీల్లో 60 శాతం కన్వీనర్ కోటా, 40 శాతం యాజమాన్య కోటా సీట్లుంటాయని చెప్పారు. ఆన్‌లైన్‌లో ఎంసెట్‌కు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసేందుకు వచ్చేనెల 28వ తేదీ వరకు గడువుందని వివరించారు. బైపీసీ చదివిన విద్యార్థులు బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరేందుకు అర్హులని స్పష్టం చేశారు.