Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విదేశాల్లోని మన ఉద్యోగులను వెళ్లగొడితే ఏంచేస్తారు
- అన్ని రంగాల్లోనూ దేశాన్ని నాశనం చేస్తున్న బీజేపీ
- దేశంలో కొత్తరాజకీయ శక్తి అవసరం
- ప్రజలకు మేలు చేసే ప్రత్యామ్నాయం కావాలి
- దుర్మార్గంగా గవర్నర్ వ్యవస్థ
- టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ ప్లీనరీలో ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్
మతవిద్వేషంతో రాజకీయ పబ్బం గడుపుకోవాలనే పరిస్థితిలో కొన్ని పార్టీలున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని బీజేపీ నాశనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 'మత విద్వేషం మంచిదా? దాంతో ఏం సాధించగలం? విద్వేషాలతో రాజకీయ పబ్బం గడుపుకోవడమేంటి?ఎక్కడైనా కూలగొట్టడం, విధ్వంసం చేయడం తేలిక. నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది? విద్వేషాలతో పెట్టుబడులు వస్తాయా?' అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లక్ష్యం లేని దిశగా మోడీ సర్కారు పాలన నడుస్తున్నదనీ, దేశంలో గలీజు రాజకీయాలు నడుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నేడు దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమనీ, ఆ దిశగా టీఆర్‌ఎస్ శక్తిమేరకు కృషి చేస్తుందని ప్రకటించారు. టీఆర్‌ఎస్ లాగానే దేశంలో బీఆర్‌ఎస్(భారత రాష్ట్ర సమితి) ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వస్తోందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైటెక్ సిటీలోని హెచ్‌ఐసీసీలో ప్లీనరీని నిర్వహించారు. సభావేదికపై టీఆర్‌ఎస్ జెండాను కేసీఆర్ ఎగురవేశారు. ముఖ్యనేతలతో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నేత కే.కేశవరావు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం కేసీఆర్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'భారత సమాజం శాంతి, సహనానికి ఆలవాలం. కర్నాటక రాజధాని బెంగుళూరులో 30 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. పరోక్షంగా మరో 30 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. దీని వెనుక గత పాలకుల కృషి ఎంతో ఉంది. అక్కడ బీజేపీ వాళ్లు హిజాబ్, హలాల్‌లను తెరపైకి తెచ్చారు. ముస్లింల వద్ద పండ్లు, పూలు కొనొద్దని రెచ్చగొడుతున్నారు. చేసే పనిలోనూ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడమేంటి? ఇదెక్కడి దౌర్భాగ్యం? 13 కోట్ల మంది విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు మా మతం, మా జాతి కాదని వెళ్లగొడితే పరిస్థితేంటి? కేంద్రం వారికి ఉద్యోగాలిస్తదా? ఆ శక్తిసామర్థ్యాలున్నాయా?' అంటూ కేసీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. 'నిరుద్యోగం, ఆకలి సమస్య పెరిగింది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మరోపక్క నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. ఇన్ని సమస్యలతో దేశం సతమతమవుతుంటే దానిపై దృష్టి పెట్టకుండా..ఈ మత పిచ్చి ఏంటి?' అని విమర్శించారు.
కావాల్సింది కత్తులు, తుపాకులు కాదు... ఉద్యోగాలు, ఉపాధి
'పుల్వామా, సర్జికల్ స్ట్రైక్స్, కశ్మీర్ ఫైల్స్ అంటూ విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. కాశ్మీర్ పండితులే మమ్ముల్ని రాజకీయంగా వాడుకోవద్దని చెబుతున్నా సిగ్గులేదా? పిచ్చి కొట్లాటలతో నష్టపోతున్నాం' అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో దేవుని పేరుమీద జరిగే ఊరేగింపులో కత్తులు, తుపాకులు ఎందుకని ప్రశ్నించారు. 'మహాత్ముడు కలలుగన్నది ఈ దేశమేనా? జాతిపిత గాంధీని దుర్భాషలాడటం, ఆయనను చంపిన హంతకులను పూజించడం ఏం సంస్కృతి? ఏం ఆశించి ఇలా చేస్తున్నారు?' అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్నే గుణపాఠంగా...
గవర్నర్ వ్యవస్థ దుర్మార్గంగా మారిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్సీల కోసం తీర్మానం చేసి పంపితే గవర్నర్ తన వద్దే పెట్టుకున్నారని గుర్తుచేశారు. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు చేసి పంపితే గవర్నర్ వింతగా ప్రవర్తించారని విమర్శించారు. బెంగాల్, కేరళలోనూ పంచాయతీ నడుస్తోందన్నారు. ప్రజల బలంతో గెలిచిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని దుర్మార్గపు గవర్నర్ వ్యవస్థ ద్వారా కాంగ్రెస్‌వాళ్లు గద్దె దింపిన విషయాన్ని ప్రస్తావించారు. అదే ఎన్టీఆర్‌ను ప్రజలు తిరిగి గద్దెనెక్కించారని గుర్తుచేశారు. అప్పుడే గవర్నర్ వ్యవస్థను ఒక గుణపాఠంగా తీసుకుని ముందుకెళ్తే బాగుండేదన్నారు.
తెలంగాణకు కాపలాదారులం..
'80 శాతం మంది పరిపాలనా భాగస్వాములుగా ఉన్న ప్రజాప్రతినిధులు, 60 లక్షల మంది పార్టీ సభ్యులు, దాదాపు వెయ్యి కోట్ల ఆస్తులు కలిగి ఉన్న పార్టీ టీఆర్‌ఎస్. అందంతా తెలంగాణ ప్రజల ఆస్తి. అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని సుభిక్షంగా తీరిదిద్దుతున్న పార్టీ మాది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కాపలాదారులంగా ఉంటాం' అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ దేశానికే రోల్ మోడల్ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఫలితాలు, అవార్డులు, రివార్డులే తమ పనితీరుకు మచ్చుతునక అన్నారు. దేశంలోని మొదటి పది ఉత్తమ గ్రామపంచాయతీలు తెలంగాణవే ఉండటం, తొలి 20 జీపీల్లో 19 నిలవడం గర్వంగా ఉందన్నారు. తెలంగాణ నేడు జలభాండగారంగా మారిందనీ, పాలమూరు రంగారెడ్డి, సీతారామ పూర్తి చేసుకుంటే రాష్ట్రంలో కరువే ఉండదని చెప్పారు. గతంలో తెలంగాణ నుంచి ముంబయికి 16 నుంచి 18 లక్షల మంది వలస పోయేవారనీ, ఇప్పుడు అందరూ రాష్ట్రానికి వచ్చేసారని తెలిపారు. 11 రాష్ట్రాల నుంచి 25 నుంచి 30 లక్షల మంది కార్మికులు బతుకుదెరువు కోసం తెలంగాణకు వస్తున్నారనీ, బీహార్ కార్మికులు లేకుంటే రైస్‌మిల్లులు నడవవనీ, యూపీ, బెంగాల్, బీహార్ కార్మికులు లేకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మాణ రంగం పనులు సాగని పరిస్థితి ఉందని వివరించారు. దళితబంధు, దళిత రక్షణ నిధితో దళితుల కుటుంబాల్లో పెనుమార్పులు రాబోతున్నాయని చెప్పారు.
వనరులతో యువశక్తికి ఉపాధి కల్పించండి
మన దేశానికి 65వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయనీ, టిబెట్ నుంచి వస్తున్న నీళ్లలో మరో 4,5 వేల టీఎంసీల వాటా తేలాల్సి ఉందని కేసీఆర్ చెప్పారు. కానీ, మనం 29, 30 వేల టీఎంసీలకు మించి వాడుకోట్లేదన్నారు. కర్నాటక-తమిళనాడు మధ్య కావేరీ జలాలు, రాజస్తాన్, హర్యానా, పంజాబ్ మధ్య నదీ జలాల వివాదాలు, ఇలా ఏ రెండు రాష్ట్రాల మధ్య చూసినా నీటికోసం కొట్లాడుకుంటున్న పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హుంకారాలు..హాంకారాలు..మైకులు పగిలే ఉపన్యాసాలు తప్ప ప్రజల అవసరాలను పట్టించుకునే స్థితిలో కేంద్రపాలకులు లేరని విమర్శించారు. దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్లన్నారు. అందులో రెండు లక్షలకు మించి వాడటం లేదని తెలిపారు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో, మన చుట్టుపక్కలున్న రాష్ట్రాల్లోనూ కరెంట్ కోతలున్నాయనీ, చుట్టూ అంధకారం ఉంటే మణిద్వీపంలా తెలంగాణ 24 గంటలతో వెలుగుతున్నదని చెప్పారు. తెలంగాణలా కేంద్రం పని చేసి ఉంటే.. దేశమంతటా 24 గంటల కరెంట్ ఉండేదన్నారు. నిటి ఆయోగ్ సమావేశంలో ప్రధాని ఎదుటే ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టి చెప్పినా లాభం లేకుండా పోయిందన్నారు. మన దగ్గర ఉన్న వనరులను సరిగా వినియోగంలోకి తెస్తే ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న మన దేశంలో అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని కేంద్రానికి సూచించారు.
అభివృద్ధిలో చైనా ఎక్కడుంది...మనమెక్కడున్నాం..
'1980లో మన దేశం కంటే చైనా జీడీపీ తక్కువ. 20,25 ఏండ్లలో ఆ దేశం ఏ స్థాయికి ఎదిగింది? మన మెక్కడ ఉన్నాం? చైనాలో కంటే మన దేశంలోనే వ్యవసాయ భూములు ఎక్కువ. కానీ, ఏం లాభం వాడుకోలేని దుస్థితి. చైనా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగితే మన జీడీపీనేమో మోడీ హయాంలో పడిపోయిన పరిస్థితి. మనం ఏదిశగా పోతున్నాం? ఇజ్రాయిల్ మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత ఉండదు..అక్కడ నుంచి ఆయుధాలు కొనడమేంటి? ఓ జిల్లా అంత లేని ఆస్ట్రియా దేశం నుంచి పంపులు దిగుమతి చేసుకోవాల్సి పరిస్థితి నెలకొనడమేంటి? మనం స్వతంత్రంగా ఎదిగే కృషి చేయరా? మరోవైపు 75 ఏండ్ల స్వాతంత్య్ర భారంతంలో రేషన్ బియ్యం అందించినందుకు ఓటెయ్యమని అడిగే దౌర్భాగ్య పరిస్థితి ఉండటమేంటి? మట్టి, మంచినీళ్లు కూడా కొనుక్కునే సింగపూర్ ఆర్థిక పరిస్థితేంటి? మనకన్నా ఎక్కువ పర్యాటక ప్రాంతాలు ఆ దేశంలో ఉన్నాయా? నేనేం ఊరికే చెప్పట్లేదు హేతుబద్ధంగా మాట్లాడుతున్నా. పాలకుల్లో చిత్తశుద్ధి లోపించడమే దీనికి కారణం. మార్పు రావాలి. ప్రత్యా మ్నాయ ఎజెండా ముందుకు రావాలి' అని కేసీఆర్ అన్నారు.
సంకుచిత విధానం కాదు..అభ్యుదయ పథం కావాలి
'మన దేశం ముందుకుపోవాలన్నా, రాజ్యాంగం అమలు కావాలన్నా, అంబేద్కర్ స్ఫూర్తి నిజం కావాలన్నా, మౌలిక మార్పులు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యామ్నాయ ఎజెండాతో, కొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించాలి' అని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ పుట్టినట్టే దేశం కోసం కూడా ఒక శక్తి తప్పకుండా పుడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన.. దేశ రాజకీయాలను ప్రభావితం చేయడానికి, గతిని, స్థితిని మార్చడానికి, దేశాన్ని సరైన ప్రగతి పంథాలో నడిపించడానికి హైదరాబాద్ వేదికగా కొత్త ఎజెండా, ప్రతిపాదన, సిద్ధాంతం తయారై దేశం నలుమూలల వ్యాపిస్తే ఈ దేశానికే గర్వకారణంగా ఉంటుందని తెలిపారు. 'ప్రత్యామ్నాయ రాజకీయ ఫ్రంట్లు, గుంపులు కాదు.. ఒకరిని దింపి మరొకరిని గద్దెనెక్కించే కూటములు కాదు... ప్రజల కోసం పనిచేసే ప్రత్యామ్నాయ ఎజెండా ఈ దేశానికి కావాలి. ఆ దారులు వెతకాలి. నూతన వ్యవసాయ విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన పారిశ్రామిక విధానం రావాలి. అందుకు అవసరమైన వేదికలు తయారు కావాలి. సంకుచిత రాజకీయాలు వద్దు. దేశానికి అభ్యుదయ పథం కావాలి. అప్పుడే ఉజ్వలమైన భారత్ రూపుదిద్దుకుంటుంది' అని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టులతో అదే చెప్పా...
'ఇటీవల హైదరాబాద్‌లో ఒక మీటింగు నిర్వహించిన సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు నా దగ్గరకు వచ్చారు. మనమందరూ ఒకటి కావాలంటూ నాకు సూచించారు. ఏ విషయంలో అని నేను వారిని అడిగా. దానికి వారు బీజేపీని గద్దె దించే విషయంలో మనందరం ఒకటి కావాలని చెప్పారు. నేను దానికి... ఇలాంటి చెత్త అజెండాలొద్దు... వాణ్ని దించి వీణ్ని, వీణ్ని దించి వాణ్ని గద్దెనెక్కించే పద్ధతులకు నేను వ్యతిరేకం. ఒక పార్టీని దించి, ఇంకో పార్టీనీ గద్దెనెక్కించటమనేది కాదు... ఇప్పుడు దేశానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా, ప్రత్యామ్నాయ ప్రజల అజెండా కావాలని చెప్పా...' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.