Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇదే బీజేపీ సర్కార్ విధానం
- టీఆర్‌ఎస్ ప్లీనరీలో తీర్మానం
- మొత్తం 13 తీర్మానాలకు సభ ఆమోదం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వం, అధికార కేంద్రీకరణే లక్ష్యంగా విధానాలు అమలు చేస్తున్నదనీ, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలనే తీర్మానానికి టీఆర్‌ఎస్ ప్లీనరీ ఆమోదం తెలిపింది. ప్లీనరీలో మొత్తం 13 అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టగా, వాటిపై విస్త్రుత చర్చ నిర్వహించి, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ''వన్ నేషన్, వన్ మార్కెట్, వన్ రిజిస్ట్రేషన్'' అంటూ బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న నినాదాల వెనుక అధికార కేంద్రీకరణ, నియంతృత్వ విధానాలు ఉన్నాయని రాజకీయ తీర్మానంలో పేర్కొన్నారు. మత విద్వేష రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జలవివాదాల పరిష్కారంలో కేంద్రం వైఖరిని ఎండగడ్తూ తీర్మానాన్ని ఆమోదిం చారు. యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్రప్రభుత్వమే కొనుగోలుచేస్తున్నం దుకు అభినందిస్తూ తీర్మానం చేశారు. అలాగే దేశం విస్తత ప్రయోజనాలరీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలనే రాజకీయ తీర్మానానికి ప్లీనరీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్ని వస్తువుల ధరలు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి ని నిరసిస్తూ, ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసి, అమలు చేయాలని తీర్మానించారు. భారతదేశ సామర స్య సంస్కతిని కాపాడుకోవాలనీ, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానించారు. బీసీ వర్గా లకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలనీ, బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలనీ, రాష్ట్రాల ఆదాయానికి గండి కొడు తూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలనీ, డివిజ బుల్ పూల్ లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మా నించారు. నదీజలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకా రం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్ణయించాలని, ఈ మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేయాలి. భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజా స్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం చేశారు. రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటుచేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని తీర్మానం చేశారు. ఈ తీర్మానాలను మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మహమూద్ అలీ, కే తారకరామారావు, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, ఎల్ రమణ, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ ప్లీనరీలో ప్రతిపాదించారు. వీటిని మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, మెతుకు ఆనంద్, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, పద్మాదేవేందర్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, కేపీ వివేకానంద, రేగా కాంతారావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బలపరుస్తూ ప్రసంగించారు.