Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
- అమీన్‌పూర్‌లో మేడే వారోత్సవాలు ప్రారంభం
నవ తెలంగాణ - అమీన్‌పూర్
ఉద్యమాలకు ఊపిరి పోసిన మేడే స్ఫూర్తితో కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. మేడే వారోత్సవాల సందర్భంగా సోమవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ బీరంగూడ గుడి కమాన్‌లో చికాగో నగర అమరవీరులకు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం మేడే వారోత్సవాలను భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 136 ఏండ్ల కిందట ఎనిమిది గంటల పని దినాల కోసం చికాగో నగరంలో జరిగిన పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గ ఐక్యతను చాటుతూ 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అంటూ చేపట్టిన ఐక్య ఉద్యమాల ఫలితంగా అనేక చట్టాలు సాధించుకున్నామని తెలిపారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల మూలంగా ప్రభుత్వాలు తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ ప్రస్తుతం మళ్లీ 12 గంటల పని దినాలు కోసం ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాల మార్పుతో కార్మికులను కట్టు బానిసలుగా మార్చే యత్నం చేస్తోందని విమర్శించారు. దీన్ని ఎంతమాత్రం ముందుకు సాగనీయకుండా మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. 1వ తేదీ నుంచి 7 వరకు జరిగే ఈ ఉత్సవాలు కళాకారుల ఆట పాటలతో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాయిని నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు పాండురంగారెడ్డి, అమీన్ పూర్ మండల నాయకులు జార్జ్, శ్రీనివాస్, సురేష్, జయరామ్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.