Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాశ్వత సంక్షేమమే కమ్యూనిస్టు సిద్ధాంతం :
- మాలి పురుషోత్తంరెడ్డి వర్ధంతి సభలో తమ్మినేని
నవతెలంగాణ-మిర్యాలగూడ
కమ్యూనిస్టు పార్టీ లేనిదే దేశానికి భవిష్యత్ లేదని.. ప్రజలకు శాశ్వత సంక్షేమం చూపించడమే కమ్యూనిస్టు సిద్ధాంతమని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని మొలకపట్నంలో ఏర్పాటు చేసిన పార్టీ మాజీ జిల్లా కమిటీ సభ్యులు మాలి పురుషోత్తంరెడ్డి విగ్రహాన్ని శుక్రవారం తమ్మినేని ఆవిష్కరించారు.
అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ.. దేశప్రజలకు కమ్యూనిస్టు సిద్ధాంతం అవసరమని చెప్పారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా మార్చేందుకు ప్రజా ఉద్యమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి మనిషికీ ఉపాధి, విద్య, వైద్యం, నివాసం ఉచితంగా ఇవ్వాలని, అప్పుడే అభివృద్ధి సాధ్యమౌతున్నదని చెప్పారు. తాత్కాలిక పథకాలు చూపించి రాజకీయంగా లబ్ది పొందుతున్నారని, అది ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. ఏనాటికైనా కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుందని, అప్పుడే ప్రజారాజ్యం ఏర్పడుతుందని తెలిపారు. ప్రజా పోరాటాల లక్ష్యంగా సీపీఐ(ఎం) ముందుకెళ్తుందన్నారు. మాలి పురుషోత్తంరెడ్డి సిద్ధాంతం నమ్మిన వ్యక్తి అని, పార్టీ నిర్మాణం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేశారని, ఆయన్ను పేద ప్రజలు ఎన్నటికీ మరువరన్నారు. ఆయన ఆశయ సాధనకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ, పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.