Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నాపత్రం ముద్రించని ఇంటర్ బోర్డు
- చేతిరాత ప్రశ్నాపత్రం జిరాక్స్ ప్రతుల అందజేత
- అయోమయంలో విద్యార్థులు
- హైదరాబాద్‌లోని అంబేద్కర్ కాలేజీలో ఘటన
- తర్వాతి పరీక్షలూ ఇదే పద్ధతిలో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ పేపర్-1 ప్రశ్నాపత్రం హిందీ మాధ్యమంలో ముద్రించి ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. పొలిటికల్ సైన్స్ పేపర్-1 ఇంగ్లీష్ మాధ్యమంలోని ప్రశ్నాపత్రాన్ని హిందీలోకి అనువాదం చేసి చేతిరాతతో కూడిన ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు అందించారు. అదీ జిరాక్స్ ప్రతులను ఇవ్వడం గమనార్హం. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడి విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. ఈ పద్ధతి గతంలో ఎప్పుడూ లేదు. ఈ ఏడాది ఇంటర్ వార్షిక పరీక్షల నుంచే కొత్త పద్ధతికి ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తర్వాత హిందీ మాధ్యమంలో జరిగే పరీక్షల ప్రశ్నాపత్రాలూ ఇదే పద్ధతిలో ఉండనున్నాయి. అంటే ఇంగ్లీష్ మాధ్యమంలో ముద్రించిన ప్రశ్నాపత్రాన్ని అనువాదం చేసి ఇవ్వనున్నారు. దీంతో హిందీ మాధ్యమం పట్ల ఇంటర్ బోర్డు కు అంత ఖాతరు లేదనిపిస్తొంది. కేవలం విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో చిన్నచూపు చూస్తుండడం గమనార్హం. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరైంది కాదని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాల నేతలు సూచిస్తున్నారు.
పరీక్ష ఫీజు తీసుకుని ప్రశ్నాపత్రం ముద్రించని వైనం
రాష్ట్రంలో రెండు కాలేజీల్లో హిందీ మాధ్యమం విద్యార్థులు ఇంటర్మీడియెట్ సీఈసీ కోర్సులో చదువుతున్నారు. హైదరాబాద్‌లోని హిందీ మహావిద్యాలయ జూనియర్ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 25 మంది, ద్వితీయ సంవత్సరంలో 17 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక నిజామాబాద్‌లోని ఆదర్శ హిందీ మహావిద్యాలయ జూనియర్ కాలేజీలో ప్రథమ సంవత్సరంలో ఏడుగురు, ద్వితీయ సంవత్సరంలో ఆరుగురు విద్యనభ్యసిస్తున్నారు. అంటే హిందీ మాధ్యమంలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 32 మంది, ద్వితీయ సంవత్సరంలో 24 మంది కలిపి మొత్తం 56 విద్యార్థులు చదువుతున్నారు. ఆ రెండు కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇంటర్ బోర్డు ప్రకటించింది. 56 మంది విద్యార్థులతో పరీక్ష ఫీజు కట్టించుకుంది. తీరా పరీక్షలు వచ్చే సరికి హిందీ మాధ్యమంలో ప్రశ్నాపత్రం ముద్రించి విద్యార్థులకు ఇవ్వకుండా చేతులెత్తేసింది. ఇంగ్లీష్ మాధ్యమంలోని ప్రశ్నాపత్రాన్ని హిందీ మాధ్యమంలోకి అనువాదం చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. అయితే మార్చి ఐదో తేదీన ఆ రెండు కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు లేఖ రాసింది. ఇంటర్ వార్షిక పరీక్షల సమయంలో హిందీ అనువాదకులను నియమించుకోవాలంటూ సూచించింది. బోర్డు అధికారులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు కలిగించే ఈ పద్ధతిని మార్చుకోవాలంటూ పలువురు విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మానవతా దృక్పథంతో అనువాదకులకు అనుమతి : మధుసూదన్‌రెడ్డి
మార్వాడీ హిందీ సమితి చేసిన విజ్ఞప్తి మేరకు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని పరీక్షకు ఇంటర్ బోర్డు అనుమతి ఇచ్చిందని జీజేఎల్‌ఏ అధ్యక్షులు పి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. హిందీ మాధ్యమంలో పరీక్ష రాసిన విద్యార్థులను మానవతా దృక్పథంతో ఆయా కేంద్రాల్లో హిందీ అనువాదకులను పెట్టించి హిందీ మాధ్యమం ప్రశ్నాపత్రం విద్యార్థులకు అందించారని పేర్కొన్నారు.
హిందీలో ప్రశ్నాపత్రం ముద్రించేది లేదు : ఇంటర్ బోర్డు
హిందీతోపాటు కన్నడ, మరాఠీ మాధ్యమాల్లో ప్రశ్నాపత్రాన్ని ముద్రించేది లేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పష్టం చేశారు. తెలుగు, ఇంగ్లీష్ మాధ్యమంలోనే ప్రశ్నాపత్రాలు రూపొందించి ముద్రిస్తామని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటిని హిందీ, ఉర్దూ మాధ్యమాల్లోకి అనువాదం చేస్తామని పేర్కొన్నారు. అయితే హిందీ మాధ్యమంలో రెగ్యులర్ లెక్చరర్లు అందుబాటులో లేరని వివరించారు. అందుకే ప్రయివేటు అధ్యాపకుల సేవలను వినియోగించుకోవడం లేదని తెలిపారు. హిందీ, కన్నడ, మరాఠీ మాధ్యమం పుస్తకాలను ఇంటర్ బోర్డు ముద్రించలేదని పేర్కొన్నారు. విద్యార్థులు, యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు ఆ కాలేజీలకు అనుమతి ఇచ్చామని వివరించారు.