Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరైన కూలి పడటం లేదని రాస్తారోకో
నవతెలంగాణ-గణపురం
చేసిన పనికి సరైన కూలి పడ్తలేదని ఉపాధిహామీ కూలీలు బుధవారం రోడ్డెక్కారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలం పరకాల-ములుగు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. దాంతో రహదారి స్తంభించిపోయింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో కొన్ని రోజులుగా చేస్తున్న ఉపాధి హామీ పనులకు తక్కువ డబ్బులు పడుతున్నాయన్నారు. ఉదయం 6 గంటలకు పనిలోకి వెళ్లి ఎండలో చేస్తుంటే కనీసం రోజుకు రూ.30 నుంచి రూ.70 లోపే పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఫీల్డ్ మీదికి రావడంలేదని ఆరోపించారు. పని ప్రదేశంలో కనీస వసతులు, తాగునీరు, ప్రధమ చికిత్స కిట్లు అందించట్లేదన్నారు. కూలీలను పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైస్ ఎంపీపీ అశోక్ మాట్లాడుతూ... ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజు సగటున రూ.255 చెల్లిస్తుందని, ఇక్కడ ఉన్న అధికారులు రోజుకు రూ.60 నుంచి రూ.70 ఇవ్వడం సరికాదన్నారు. ప్రతి కూలీకి రోజుకు రూ.250 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపి ఆందోళనలో పాల్గొన్నారు.
కొలతల ప్రకారమే డబ్బులు చెల్లిస్తాం : ఎంపీడీఓ అరుంధతి
ఉపాధి హామీ కూలీలకు కొలతల ప్రకారమే డబ్బులు చెల్లిస్తామని ఎంపీడీవో అరుంధతి, ఇన్‌చార్జి ఏపీవో రాజు అన్నారు. ఉపాధిహామీ కూలీలు చేస్తున్న ధర్నా వద్దకు చేరుకొని వారు మాట్లాడారు. ఉపాధి పనులు చేసే కూలీలు పనులు చేయడమే కాకుండా, వారికిచ్చిన మస్టర్‌ను చెక్ చేసుకోవాలన్నారు. కొందరు మేట్లు ఉపాధి హామీ పనులకు రాని కూలీల పేర్లు రాయడం వల్ల పనికి వచ్చిన వారికి డబ్బులు తక్కువ పడే ప్రమాదం ఉందన్నారు. మస్టర్ ఇవ్వడం తోటే మేట్లు ప్రతిరోజూ వచ్చిన వారి హాజరు వేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ విజిట్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శిని వేరే జీపీకి మార్చుతామన్నారు. రేపటి నుంచి ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ మీదికి వెళ్లి పరిశీలిస్తారని చెప్పారు.