Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు
- రొడ్డ అంజయ్య సేవలను గుర్తు చేసుకున్న నాయకులు
- నివాళ్లర్పించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
నిరుపేద కుటుంబంలో పుట్టి కడవరకు కమ్యూనిస్టుగా బతికారు రొడ్డ అంజయ్య. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌లో మరణించిన అంజయ్య భౌతికకాయాన్ని శుక్రవారం తెల్లవారుజామున యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ సీపీఐ(ఎం) కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. కూలీలను ఏకం చేసి ఉద్యమాలకు ఊపిరి పోశారు అంజయ్య. రామన్నపేట తాలుకాలో వ్యవసాయ కార్మిక సంఘంలో తనదైన ముద్ర వేసుకున్నారు. రైతుల కోసం పరితపించి, సింగిల్ విండో చైర్మెన్‌గా పని చేసి రైతుల కష్టాలను తీర్చడానికి కృషి చేశారు. చౌటుప్పల్ మండలంలో మార్క్సిస్టు ఉద్యమాన్ని విస్తరింపజేయడానికి అహర్నిశలూ కృషి చేశారు. నిస్వార్ధ జీవిగా, నిబద్ధ్దత కలిగిన మార్క్సిస్టు నాయకుడిగా ఎదిగిన అంజయ్యకు సీపీఐ(ఎం) ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకత్వం, కార్మికులు.. ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయంపై రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లకిë పూలమాలలేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. రొడ్డ అంజయ్య చిన్ననాటి నుంచి నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి నిబద్ధత కల్గిన మార్క్సిస్టు నాయకుడిగా ఎదిగారని గుర్తు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆలిండియా ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ నాయకులు సాయిబాబు మాట్లాడుతూ.. అంజయ్య నిరాడంబర జీవితాన్ని గడిపి నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అంజయ్య అకాల మరణం వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమానికి తీరని లోటన్నారు. అంజయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. పార్టీ కార్యకర్తలు అంజయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రావు, నాయకులు బుర్రి ప్రసాద్, పద్మ, సీపీఐ(ఎం) ఉమ్మడి జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, ఎండి జహంగీర్, కొండమడుగు నర్సింహా, బొంతల చంద్రారెడ్డి, పీఎన్‌ఎం రాష్ట్ర కార్యదర్శి కట్ట నర్సింహా రొడ్డ అంజయ్య భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం అంజయ్య స్వగ్రామం పంతంగిలో అంత్యక్రియలు నిర్వహించారు.
రొడ్డ అంజయ్య మరణం పట్ల రాఘవులు సంతాపం
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు రొడ్డ అంజయ్య మరణం పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు.