Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- హన్మకొండ జిల్లా కన్వీనర్‌గా బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-ఎన్‌జీవోస్ కాలనీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ నిర్వహిస్తున్న బుల్డోజర్ రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని, ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. హన్మకొండ రాంనగర్‌లోని సీపీఐ(ఎం) కార్యాలయంలో జిల్లా కన్వీనర్ బొట్ల చక్రాపాణి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో శనివారం తమ్మినేని మాట్లాడారు.
బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతోందన్నారు. మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మైనారిటీలపై తాము చేస్తున్న దాడులను కప్పిపుచ్చుకోడానికి రాజ్యాంగంపై, అభ్యుదయ శక్తులపై దాడులు మరింత పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు విధానాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దేశద్రోహం లాంటి కేసులు మోపుతోందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ అదానీ, అంబానీలకు దేశ సంపదను కట్టుబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే ఊడదీస్తుందన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం వెలికితీసి ప్రతి ఒక్కరి బ్యాంకు అకౌంట్‌లో రూ.15 లక్షలు జమ చేస్తామని చెప్పి నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టిందన్నారు. రైతులకు నష్టం చేసే వ్యవసాయ చట్టాలను తీసుకొస్తే రైతులు పోరాడి వెనక్కి తిప్పికొట్టారని, కార్మికుల చట్టాలను కోడ్‌లుగా మార్చడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెండ్రోజుల సార్వత్రిక సమ్మె చేసి మోడీ విధానాలను తిప్పికొట్టారని వివరించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి నేటికీ ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలను ఆదుకోవాల్సిందిపోయి వారి గుడిసెలను కూల్చి, సీపీఐ(ఎం) నాయకులపై తప్పుడు కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్‌గా బొట్ల చక్రపాణి
సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా నూతన కన్వీనింగ్ కమిటీని 11 మందితో ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా బొట్ల చక్రాపాణిని ఎన్నుకున్నట్టు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కారక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి, వాంకుడోతు వీరన్న, రాగుల రమేష్, మంద సంపత్, జి.రాములు, డి.తిరుపతి, డి.భానునాయక్, కె.లింగయ్య, ఎల్.దీప, ఎండి మిష్రీన్ తదితరులు పాల్గొన్నారు.