Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడి భగభగ
- జైనధ్(ఆదిలాబాద్‌లో) 45.2 ఎండ
- మల్చెల్మ(జహీరాబాద్)లో ఐదు సెంటీమీటర్ల వాన
- జీహెచ్‌ఎంసీ, తదితర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉత్తరాది జిల్లాల్లో భానుడు భగభగ మండితే.. దక్షిణాది జిల్లాల్లో పలుచోట్ల వర్షం దంచికొట్టింది. ఆదిలాబాద్ జిల్లా జైనధ్‌లో అత్యధికంగా 45. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అదే సమయంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం మల్చెల్మలో అత్యధికంగా 5.05 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. బంగాళాఖాతంలో నెలకొన్న ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు 45 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్,అమీర్‌పేట్, బేగంపేట్, మూసాపేట్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బోరబండ, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. హైదరాబాద్‌లో రోజంతా ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సాయంత్రం వర్షం కురవడంతో కొంత ఉపశమనం లభించింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాలు
జైనధ్(ఆదిలాబాద్) 45.2 డిగ్రీలు
చాప్రాల(ఆదిలాబాద్) 44.9 డిగ్రీలు
ఠానూర్(నిర్మల్) 44.8 డిగ్రీలు
కెరమెరి(కొమ్రంభీం అసిఫాబాద్) 44.4 డిగ్రీలు
ఈసాల తక్కళ్లపల్లి(పెద్దపల్లి) 44.3 డిగ్రీలు
అత్యధిక వర్షం కురిసిన ఐదు ప్రాంతాలు
మల్చెల్మ(సంగారెడ్డి) 5.05 సెంటీమీటర్లు
మహబూబ్‌నగర్ 2.20 సెంటీమీటర్లు
తెలకపల్లి(నాగర్‌కర్నూల్) 2.13 సెంటీమీటర్లు
మాచన్‌పల్లి(మహబూబ్‌నగర్) 2.03 సెంటీమీటర్లు
పెద్దముద్నూర్(నాగర్‌కర్నూల్) 1.90 సెంటీమీటర్లు