Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ జాప్యంపై రేపు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు : యూఎస్పీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బుధవారం నాడు కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏడేండ్లుగా పదోన్నతులు లేక ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఈ విషయంపై పలుమార్లు హామీనిచ్చారని గుర్తుచేసింది. విద్యామంత్రి కూడా ఈ వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు పూర్తిచేస్తామని చెప్పిన విషయాన్ని నొక్కిచెప్పింది. వేసవి సెలవులు సగంరోజులు గడిచినా విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు ఎలాంటి ఆటంకాలు లేకున్నా షెడ్యూల్ విడుదల చేయకుండా రాష్ట్ర సర్కారు ఎందుకు జాప్యం చేస్తున్నదో అర్థం కావడం లేదని పేర్కొంది. జీఓ 317 పై ఉన్న అప్పీళ్లను, భార్యాభర్తల బదిలీలు, పరస్పర బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎటూ తేల్చకుండా తాత్సారం చేయడం సమంజసంగా లేదని తెలిపింది. బదిలీలపై తేల్చక పోవటం చేత వేసవి సెలవుల అనంతరం తాము ఎక్కడ నివాసం ఉండాలో అర్థం కాక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. వెంటనే 317 జీవో సంబంధిత సమస్యలను, భార్యాభర్తలు, పరస్పర బదిలీల సమస్యలను పరిష్కరించాలని యూఎస్పీసీ డిమాండ్ చేసింది. సప్లిమెంటరీ బిల్లుల మంజూరు లో జాప్యం నివారించాలనీ, నగదురహిత వైద్యం అమలు కోసం వేతనాల్లో రెండు కోతను వ్యతిరేకిస్తున్నామనీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతనే తుదినిర్ణయం తీసుకోవాలని కోరింది.