Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈనెల 30 వరకు రిమాండ్
- లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనపై నెపం
- తాను చోరీ చేయలేదన్న ప్రవీణ్
- బ్యాంక్ అధికారులు, పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు
నవతెలంగాణ-వనస్థలిపురం
నగదుతోపాటు పరారైనట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారుల ఫిర్యాదు నేపథ్యంలో క్యాషియర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం హైదరాబాద్‌లోని హయత్ నగర్ మెట్రోపాలిటన్ కోర్టులో లొంగి పోయాడు. వనస్థలి పురం రైతుబజార్ వద్ద గల బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో క్యాషియర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ ఈనెల 11న కడుపు నొప్పి ఆస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పి రూ.22 లక్షల 53378తో పరారైనట్టు బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్యాషియర్ ప్రవీణ్ కుమార్ రెండ్రోజుల కిందట తన టూవీలర్ (బుల్లెట్)ను చిట్యాల హైవే మీద వదిలి వేసినట్టు సమాచారం. అతని కోసం ఓ వైపు పోలీసులు గాలిస్తున్న క్రమంలో సోమవారం ఉదయం హయత్‌నగర్ మెట్రో పాలిటన్ కోర్టులో ప్రవీణ్‌కుమార్ లొంగిపోయాడు. కేసును పరిశీలించిన మెజిస్ట్రేట్ ఈనెల 30 వరకు ప్రవీణ్ కుమార్‌కు రిమాండ్ విధించారు. చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే, ఈ కేసు వ్యవహారంలో ప్రజలు, ఖాతాదారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులకు భరోసా కలిగేలా సమగ్ర విచారణ చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ సందర్భంగా ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. వనస్థలిపురం బ్యాంకు ఆఫ్ బరోడా శాఖ నిర్వహణలో లోటుపాట్లు ఉన్నాయని, సొమ్మును తాను చోరీ చేయలేదని అన్నాడు. గతంలోనూ నగదు తేడా వస్తే బ్యాంకు సిబ్బంది అంతా కలిసి సర్దుబాటు చేశామని చెప్పాడు. ఈ నెలలోనూ పెద్దమొత్తంలో తేడా వచ్చిందని, మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపాడు. వాళ్ల లోపాలను కప్పిపుచ్చుకునేందుకే తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. త్వరలో బయటకొచ్చాక అన్ని విషయాలను నిరూపిస్తానని చెప్పాడు.