Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పడిపోయిన మామిడి దిగుబడి
- అమాంతం పెరిగిన ధరలు
- కిలో రూ.100 నుంచి రూ.150 వరకు విక్రయం
నవతెలంగాణ-మల్హర్‌రావు
మధురఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిలువ చేసుకోవాలనే వారికి, అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకునే వారికి ఈ ఏడాది నిరాశే మిగిలింది. గతంలో మామిడి పండ్లు మార్కెట్‌లో రోజుకు టన్నుల కొద్దీ రాగా.. ప్రస్తుతం క్వింటాళ్ళలో కూడా రావడం లేదని మామిడి వ్యాపారులు వాపోతున్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా మల్హర్‌రావు మండలం తాడిచెర్ల, రుద్రారం, కాపురం, కొండంపేట గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ సంవత్సరం అనుకున్నట్టుగా పూత ఏపుగా వచ్చింది. కానీ, చీడపీడలు ఆశించడంతో పూత, కాత నిలువకపోవడం, నిలిచినా కాస్తోకూస్తో కాయలు కొత్తకొచ్చే సమయానికి ఇటీవల అకాల గాలి, దుమారం బీభత్సానికి పిందెలు, కాయలు నేలరాలాయి. చెట్లపై కాయలేకుండా రాలడంతో ఇటు మామిడి తోటలు పట్టిన వ్యాపారుల్లో అటు రైతుల్లో ఆందోళన నెలకొంది. తమకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం కష్టతరంగా మారిందని మామిడి తోటల రైతులు, గుత్తేదారులు వాపోతున్నారు. కాగా మామిడి కాయల సైజు, రకాలను బట్టి మార్కెట్‌లో ధరలు ఉన్నాయి. టన్ను మామిడి ధర రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది. నాలుగు రోజుల కిందట రికార్డు స్థాయిలో రూ.1.50 లక్షలు పలకడం విశేషం. డిమాండ్ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్ల రసాలు, హైమవతి, బంగన్‌పల్లి కిలో రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుండగా, తోతాపరి కిలో రూ.50 నుంచి రూ.80 పలుకుతోంది. పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కొక్కటి రూ.15 నుంచి రూ.20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం.
అటు మామిడి...ఇటు నిమ్మ...
వాతావరణ మార్పులతో మామిడి పూత కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్టుగా ఉద్యానవన అధికారులు పేర్కొంటున్నారు. చలికాలంలో బారీ వర్షాలు కురవడం, రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం, మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మచెట్టు 5 నుంచి 6 బస్తాల కాయలు వచ్చేవి. చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమయింది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా సైజును బట్టి రిటైల్‌గా ఒక్కొక్క కాయ రూ.10నుంచి రూ.15 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ళ సీజన్ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్‌లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్ళని తయారు చేసుకొని ఏడాదంతా నిలువ చేసుకుంటారు. మామిడి నిమ్మకాయల ధరలకు తోడు వంట నూనెలు, మసాలా దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మెతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆర్థిక బారం తప్పడం లేదు.
రుచి చూడలేక పోతున్నాం : తిరుమల, గృహిణి
సాధారణంగా నలుగురు కుటుంబ సభ్యులున్న ఒక కుటుంబం ఏడాది వినియోగానికి 5 నుంచి 10 కిలోల పచ్చడి తయారు చేసి నిల్వ ఉంచుకుంటుంది. పచ్చడిలో వాడే మామిడితోపాటు నూనెలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి, కారం ధరలు పెరిగాయి. 5 కిలోల పచ్చడికి గతంలో కంటే అదనంగా రూ.300 ఖర్చు చేయాల్సి వస్తోంది. పచ్చిడి రుచిని ఆస్వాదించాలని ఉన్నా చూడలేకపోతున్నాం.
మిగిలేది అంతంతే : పిట్టల రాజయ్య, మామిడి రైతు
ఆరు ఎకరాల్లో మామిడి సాగు చేశాను. గతంతో పోలిస్తే ఈ సారి పూత, కాత ఆలస్యంగా వచ్చాయి. ఎండలకు తోడు కోతుల బెడద ఎక్కువైంది. చీడపీడల నివారణ కోసం అధికంగా మందులు వాడాల్సి వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో పచ్చడి కాయలకు, పండ్ల రసాలకు, బంగినపల్లి కాయలకు మంచి డిమాండ్ ఉంది. కానీ దిగుబడి లేదు. దాంతో ఈ ఏడాది రూ.2లక్షలు నష్టపోయాను.