Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ చంద్రయ్య
నవతెలంగాణ - భువనగిరి
ప్రజల జీవన స్థితి గతులను తెలుసుకోవడం, ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వానికి తెలుపడం, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం మానవ హక్కుల కమిషన్ బాధ్యత అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మెన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా మంగళ వారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ ప్రభుత్వ అతిథి గృహానికి వచ్చారు. ఆయనకు భువనగిరి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాల్‌రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం కమిషన్ చైర్మెన్ మీడియాతో మాట్లాడుతూ.. మానవ హక్కుల అమలు, ప్రభుత్వ అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడం, ప్రభుత్వ స్కీముల పని విధానం, అధికారుల పని విధానం, ఎక్కడైనా లోపాలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కమిషన్ బాధ్యత అన్నారు. రేపు కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతోనూ మానవ హక్కుల అమలుపై సమీక్షించనున్నట్టు తెలిపారు. ప్రజల జీవన హక్కు, స్వాతంత్య్ర హక్కు, సమానత్వ హక్కు, ఆత్మగౌరవ హక్కులను కాపాడటమే మానవ హక్కుల కమిషన్ లక్ష్యమన్నారు. ప్రజలను చైతన్యవంతం చేసే క్రమంలో కమిషన్ తనకు తానుగా, అంతే కాకుండా ఇతర స్వచ్చంధ సంస్థలతో మమేకమై సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల జీవన స్థితిగతులు పెంపొందించే దిశలో పనిచేస్తుందని తెలిపారు. ప్రజలకు రేషన్ సరిగా అందుతున్నదా, వృద్ధాప్య పెన్షన్లు అందుతున్నాయా అని రెవెన్యూ డివిజనల్ అధికారిని అడిగి తెలుసకున్నామన్నారు. ఆపరేషన్లు కాకుండా సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. హ్యూమన్ రైట్ కమిషన్ కార్యక్రమాలు, లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యక్రమాలు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీర్పులను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పాత్రికేయులదేనని చెప్పారు.