Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి డాక్టర్ సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలోనే ఉండాలి
- లేకుంటే చర్యలు తప్పవు: రాష్ట్ర పబ్లిక్ హెల్త్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, బడ్జెట్లో రూ.11,300 కోట్లు కేటాయించిందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్ శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బాధ్యతలు చేపట్టి నుంచి వైద్య శాఖను పరుగులు పెట్టిస్తున్నారన్నారు. అందులో భాగంగానే జనగామ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. జిల్లాలో మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. ఒక్కొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 నుంచి 50 మంది మాత్రమే వస్తున్నారన్నారు. 40 నుంచి 50 వేల మంది ఉన్న జనాభాలో 30, 40 మంది రావడం సరికాదని, ఈ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాల సంఖ్య పెంపుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో కేసీఆర్ కిట్టుతోపాటు రూ.12 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. ఆస్పత్రుల్లో సహజ ప్రసవమైన పరిశీలిస్తే ప్రభుత్వాస్పత్రుల్లో సహజ ప్రసవాలు 60శాతం, ఆపరేషన్లు 40 శాతంగా ఉందని వివరించారు. ప్రయివేటు ఆస్పత్రిలో సిజేరియన్స్ 90శాతంగా ఉందన్నారు. కొంతమంది మహిళలు ప్రసవ నొప్పులకు భయపడటం, ముహూర్తాల కోసం ఆలోచించి ఆపరేషన్లు చేయించుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మలేరియా, డెంగ్యూ వంటివి లేవన్నారు. లైఫ్ స్టైల్ మారిపోవడంతో ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని, ప్రతి ఒక్కరూ శరీర శ్రమ చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జిల్లాలో ప్రయివేటు ఆస్పత్రులను తనిఖీ చేస్తున్నట్టు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల వారు నెలకోసారి నివేదికలను పంపాల్సి ఉంటుందన్నారు. అనవసరంగా సిజేరియన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంత్రి హరీశ్‌రావు ఈనెల 20న జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ మల్లికార్జున్‌రావు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.