Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాగ్రత్త పడకపోతే ప్రాణాంతకం :మంత్రి హరీశ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 13 లక్షల మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డేను పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్‌ఐ), గ్లెనిగ్లస్ గ్లోబల్ హాస్పిటల్స్ (జీజీహెచ్) 10 వేల మందిపై చేసిన సర్వే ఫలితాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సర్వే ఫలితాలు కొంత ఆశ్చర్యం, బాధను కల్గిస్తున్నాయని తెలిపారు. నిమ్స్‌లో చేసిన సర్వే ప్రకారం... కిడ్నీ సమస్యలున్న వారిలో 60 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు తేలిందని చెప్పారు. బీపీని ,షుగర్‌ని ముందుగా గుర్తించి జాగ్రత తీసుకోకపోతే ఆ వ్యాధులు ప్రాణాంతకంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పులతో కొత్త సమస్యలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తే అందులో 13 లక్షల మందికి హైపర్ టెన్షన్ ఉన్నట్టు వెల్లడైందని తెలిపారు. రాబోయే రెండు, మూడు నెలల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బీపీ, షుగర్ టెస్టులు చేసేందుకు రూ.33 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ స్క్రీనింగ్ కార్యక్రమంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. పోస్ట్ కోవిడ్ ద్వారా హైపర్ టెన్షన్ కొంత వరకు పెరిగినట్టు కనిపిస్తున్నదన్నారు. శారీరక శ్రమను పెంచాలనీ, పిల్లలకు తల్లిదండ్రులు ఆరోగ్యాన్ని ఇవ్వాలని సూచించారు. బస్తీ దవాఖానాల్లో 57 టెస్టులు చేస్తున్నారనీ, వచ్చే నెల నుంచి వాటిని 120కి పెంచనున్నట్టు వెల్లిడించారు. 45 ఏండ్లు దాటినా ప్రతి ఒక్కరు బీపీ, షుగర్ టెస్టులను చేయించుకోవాలని కోరారు.
హైదరాబాద్‌లో 50 శాతం మందికి పైగా....
హైదరాబాద్‌లో 50 శాతం మందికి పైగా హైపర్ టెన్షన్ బారిన పడే ప్రమాదముందని సీఎస్‌ఐ, జీజీహెచ్ నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడించాయి. కోవిడ్-19కు ముందు ఇది 25 శాతంగా ఉండగా, ప్రస్తుతం పెరగడం గమనార్హం. నగరవాసుల్లో 70 శాతం మంది ఉండాల్సిన బరువు కన్నా అధిక బరువు ఉన్నట్టు గుర్తించారు. ఈ సర్వే కోసం జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సహకారాన్ని తీసుకున్నారు. 25 ఏండ్ల నుంచి 50 ఏండ్లలోపున్న వారిని పరీక్షించినట్టు సీఎస్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజీవ్ గార్గ్ తెలిపారు. ఉప్పు, నూనెలు, కార్బోహైడ్రేట్స్‌ను తగ్గించుకుని, వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలని సూచించారు. జీజీహెచ్ క్లస్టర్ సీఇఓ డాక్టర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ హైదరాబాద్లో మధుమేహ రోగులు 25 శాతం నుంచి 33 శాతానికి పెరిగారని తెలిపారు.