Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీటీవోలకు డీటీఏ ఆదేశం
- ఫలించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ కృషి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త జిల్లాల వారీగా సాధారణ భవిష్యనిధి (జీపీఎఫ్) ఖాతాలను తెరవాలని జిల్లా ట్రెజరీ కార్యాలయం (డీటీవో)లకు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అఔంట్స్ (డీటీఏ) కేఎస్‌ఆర్‌సీ మూర్తి ఆదేశాలు జారీ చేశారు. వచ్చేనెల 15వ తేదీ వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా పరిషత్ పరిధిలో జీపీఎఫ్ ఖాతాలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నాయి. అంటే పాత తొమ్మిది జిల్లాల్లోనే ఆ ఖాతాలున్నాయి. 2016లో కొత్త జిల్లా పరిషత్‌లు ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త జిల్లా పరిషత్‌లకు జీపీఎఫ్ ఖాతాలను మార్చాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఇంకా పాత జిల్లాల్లోనే ఆ ఖాతాలున్నాయి. వరంగల్‌లో ఇటీవల టీఎస్‌యూటీఎఫ్ ప్రాతినిధ్యం చేసింది. ఈ మేరకు కొత్త జిల్లాల వారీగా జీపీఎఫ్‌లు తెరవాలంటూ వరంగల్ జెడ్పీ సీఈవో డీటీఏ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ కృషి ఫలితంగా ఈ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆ ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లాల వారీగా పంచాయతీరాజ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీపీఎఫ్ ఖాతాలు తెరవాలంటూ డీటీవోలకు డీటీఏ ఆదేశాలిచ్చారు. సొమ్మును కొత్త అకౌంట్లలో జమ చేయాలని ఆదేశించారు. గతంలో తొమ్మిది జిల్లా పరిషత్‌లు ఉంటే, ప్రస్తుతం 32 జిల్లాల జెడ్పీలు ఏర్పడిన విషయం తెలిసిందే. దాని ప్రకారం 32 జిల్లాల్లోనూ జీపీఎఫ్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగుల విభజన ప్రక్రియ సైతం పూర్తయ్యింది. కొత్త జిల్లాల ప్రకారం జీపీఎఫ్ ఖాతాలు తెరిచేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇంకోవైపు 2016 తర్వాత వరంగల్ వంటి జిల్లాల్లో జీపీఎఫ్‌లోని సొమ్ము పాత జిల్లాకు రాలేదు. 2016లో జిల్లాల పునర్విభజన ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. సబ్ ట్రెజరీ కార్యాలయాల (ఎస్టీవో)ల్లోనే ఆ సొమ్ము ఉన్నది. రుణాలు ఇవ్వాల్సి వస్తే పాత బ్యాలెన్స్ ప్రకారం అధికారులు ఇస్తున్నారు. ఈ ఐదారేండ్ల కాలంలో జమ అయిన సొమ్మును లెక్కలోకి తీసుకోవడం లేదు. దానివల్ల ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. రుణాలు తీసుకోవాలంటే ఇబ్బంది అవుతున్నది. అందుకే కొత్త జిల్లాల ప్రకారం జీపీఎఫ్ ఖాతాలు తెరిస్తే వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న సొమ్మును కొత్త జిల్లాల వారీగా ఖాతాలు తెరిచి వాటిలో జమ చేయాల్సి ఉంటుంది.