Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగుదార్లకు హక్కుపత్రాలెప్పుడిస్తారు
- సీఎంగారూ... ఇచ్చిన మాట మరిచారా? : తమ్మినేని ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పోడురైతులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఏండ్ల తరబడి భూమిని నమ్ముకుని బతుకుతున్న పోడు రైతులు వేధింపులకు గురవుతున్నారని తెలిపింది. గిరిజనులు, ఇతరపేదల సాగులో ఉన్న పోడు భూములకు హక్కులు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పినప్పటికీ, సోమవారం మహబూబాబాద్‌లో మళ్లీ పోడురైతులపై అధికారులు దాడులకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది. తక్షణమే దాడులను ఆపి, పోడు భూముల దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సాగుదార్లకు హక్కు పత్రాలివ్వాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కొత్తపల్లి గ్రామం జంగాలపల్లి చెరువు సమీపంలో 40 ఏండ్లుగా పోడు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ అధికారులు కందకాలు తీసేందుకు పూనుకున్నారని విమర్శించారు. రైతులు ఎదురుతిరగడంతో వెనుతిరిగారని తెలిపారు.
గతంలోనూ వివిధ జిల్లాల్లో అక్రమ కేసులు, అరెస్టు వారెంట్లు, దాడులు చేసి పోడు రైతులను ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సందర్భంలో ప్రతి ఏజెన్సీ నియోజకవర్గానికి తానే స్వయంగా హాజరై సమస్యను పరిష్కరిస్తానంటూ సీఎం కేసీఆర్ వాగ్దానం చేశారని గుర్తు చేశారు. పోడు భూములకు హక్కులు కల్పించాలంటూ అనేక ఏండ్లుగా గిరిజన, ప్రజా సంఘాలు, వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయని తెలిపారు. ఫలితంగా పోడు భూములకు హక్కులు కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని వివరించారు.
2021, నవంబర్ ఎనిమిది నుంచి 30 వరకు పోడు సాగుదార్ల నుంచి దరఖాస్తులూ స్వీకరించారని పేర్కొన్నారు. కానీ నేటికీ హక్కుపత్రాలివ్వకపోగా, పోడు దారులపై అధికారులు దాడులకు పాల్ప డుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పోడురైతులపై దాడులను ఆపి, రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన పోడు దరఖాస్తులన్నింటినీ సంక్షేమశాఖ నోడల్ ఏజన్సీగా రెవెన్యూ, అటవీశాఖ సమక్షంలో పరిశీలన జరపాలని కోరారు. హక్కుదార్లను గుర్తించి వారికి హక్కుపత్రాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.