Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లారీలకు అడ్డంగా ధాన్యం బస్తాలు వేసి నిరసన
నవతెలంగాణ-రెంజల్
పలుకుబడి ఉన్న వ్యక్తుల ధాన్యం తరలిస్తూ.. చిన్న, సన్నకారు రైతుల ధాన్యం రైస్‌మిల్లుకు తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీలా గ్రామంలో ధాన్యం తూకం వేసి 15 రోజులవుతున్నా.. ఇంకా తరలించకపోవడంతో ఆగ్రహంతో ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీలను అడ్డుకొని బస్తాలు అడ్డంగా వేసి మంగళవారం రైతులు నిరసన చేపట్టారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట తూకం వేసి పదిహేను రోజులైనా ఇంతవరకు వాటిని రైస్‌మిల్‌కు తరలించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుకుబడి గల వ్యక్తుల ధాన్యం బస్తాలు మాత్రం వెంటనే లారీలను పంపించి ధాన్యం తీసుకెళ్తున్నారని, చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులు, వర్షం వస్తుండటంతో తాము భయంభయంగా బస్తాలను కాపాడుకోవాల్సి వస్తోందని వాపోయారు. రోడ్డుపై బైటాయించడంతో సింగిల్విండో చైర్మెన్ ఇమాంబేగ్, కార్యదర్శి రైతులను సముదాయించారు. వెంటనే ధాన్యాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. నిరసన తెలిపిన వారిలో రైతులు బండారు పోశెట్టి, బాలు, కమ్మరి రాజు, దేవా, ఎల్లప్ప, డి. సాయిలు తదితరులు ఉన్నారు.