Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రోబోట్లను తయారు చేసిన మనిషే...రోబోట్‌గా మారిపోతున్నాడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మాజీ సలహాదారు, పద్మశ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి అన్నారు. ఐటీ రంగంలో భౌతికశ్రమకు అవకాశం లేదనీ, మానసిక వత్తిళ్లకు గురై తక్కువ వయసులోనే వృద్ధాప్య లక్షణాలకు దగ్గరవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. యువతరం ఈ మార్పును గమనిస్తూ, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (తెలంగాణ కేంద్రం), ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ (ఐఈటీఈ-హైదరాబాద్ కేంద్రం) సంయుక్తాధ్వర్యంలో 'వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే' నిర్వహించారు. ఈ సందర్భంగా 'వయోవృద్ధులకు ఆరోగ్యకరమైన డిజిటల్ సాంకేతికతలు' అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. సాంకేతికత పెరగాలనీ, అదే సమయంలో మనిషి సమాజం నుంచి దూరం కాకూడదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఇంట్లో నుంచి మనిషి ఎక్కడకూ వెళ్లకుండానే రోజులు గడిపే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. కోవిడ్ తర్వాత ఐటీ రంగంలో వర్క్ ఫ్రం హౌంతో ఆహ్లాదకరమైన ఆరోగ్య పరిణామాలు అనేక మార్పులు చెందాయని విశ్లేషించారు. కనీసం బ్యాంకులకు కూడా మనుషులు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకొనే స్థితికి చేరామనీ, త్వరలో ఓటు హక్కును కూడా ఇంట్లోంచే వినియోగించుకొనే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. సాంకేతికత ఎంత పెరిగినా, మనిషి తన జీవనశైలిని మార్చుకోకూడదనీ, అవసరమైన వ్యాయామం, శారీరక శ్రమ, ప్రాణాయామం వంటివి తప్పని సరిగా ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న న్యూరో సైకియాట్రిస్ట్ డాక్టర్ సునీతారెడ్డి మాట్లాడుతూ కుటుంబాలతో కలిసి ఉండటాన్నే వయో వృద్ధులు ఇష్టపడతారనీ, దానివల్ల వారిలో వృద్ధాప్య లక్షణాలు 60 శాతం కనుమరుగవుతాయని చెప్పారు. 2050 నాటికి భారతదేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు వయో వృద్ధులుగా మారతారని యునైటెడ్ నేషన్స్ ప్రకటించిందని గుర్తు చేశారు. వయోధికుల బాగోగులు చూసుకోవడాన్ని యువతరం భారంగా భావిస్తున్నదనీ, ఆ పరిస్థితుల్లో మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఇన్ఫోసిస్ డిజిటల్ ఎంగేజ్‌మెంట్ ఇంక్యూబేషన్ సెల్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ సుబ్బారావు మాట్లాడుతూ అంతర్జాతీయ సాంకేతికతలో మెటావర్స్ టెక్నాలజీకి అద్భుత భవిష్యత్ ఉన్నదనీ, ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మనుషుల జీవన ప్రమాణాలు అనేక మార్పులకు గురవుతాయని విశ్లేషించారు. ఈ టెక్నాలజీ అభివృద్ధికి తమ సంస్థ అవసరమైన సాంకేతిక, భౌతిక సహకారాన్ని అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమానికి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (తెలంగాణ కేంద్రం) చైర్మెన్ బీ బ్రహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. సహాయ కార్యదర్శి డాక్టర్ కే సీతారాంబాబు, కార్యదర్శి జీ వెంకటసుబ్బయ్య, ఐఈటీఈ హైదరాబాద్ కేంద్రం చైర్మెన్, కార్యదర్శులు కే జ్ఞానేశ్వరరావు, కే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.