Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న హైదరాబాద్‌లో ఆలిండియా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్,కో-ఆర్డినేషన్ సమావేశం: సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల ప్రయాణాలతో పాటు సరుకు రవాణాకు అత్యంత అనువైన రైల్వే రవాణా వ్యవస్థను మోడీ సర్కార్ ధ్వంసం చేస్తున్నదని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ నగర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలిండియా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ కో-ఆర్డినేషన్ కమిటి సభ్యులు బి మధు, హైదరాబాద్ రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) అధ్యక్షులు ఎం వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ ఈ నెల 26న హైదరాబాద్‌లో ఆలిండియా రైల్వే కాంట్రాక్ట్ వర్కర్స్ కో-ఆర్డినేషన్ కమిటి(సీఐటీయూ) సమావేశం జరగనున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే రంగాన్ని కారుచౌకగా పెట్టుదారులకు అమ్మేందుకు ప్రణాళికలు రూపొందించని విమర్శించారు.వారికి లాభాలు సమకూర్చే విధంగా భారత పాలకులు డిజైన్ చేశారని చెప్పారు.జాతీయ ఆస్తుల నగదీకరణ పేరుతో సాగుతున్న తతంగంలో భాగంగా రైల్వే రంగంలో ప్రయివేటీకరణకు పెద్ద పీట వేశారన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించటంపై వారు కేంద్రీకరిస్తున్నారని చెప్పారు. మౌలిక వసతులను పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసే చర్యలకు పాలకులు పూనుకుంటున్నారని వివరించారు. 2,141 కిలోమీటర్ల రైల్వే లైన్లు, 400 రైల్వే స్టేషన్లు, 150రైళ్లు, 15 రైల్వే స్టేషన్లు, 360 గూడ్సు షెడ్లు, రైల్వే ఆస్తులు,భూములను ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కారు తహతహలాడుతున్నదని విమర్శించారు. ఈ విధానంలో భాగంగానే కాంట్రాక్టీకరణ పెరిగిందని చెప్పారు. పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నదన్నారు. గతంలో 15.7లక్షల మంది ఉన్న పర్మినెంట్ ఉద్యోగుల సంఖ్య నేడు 12.5లక్షలకు తగ్గిందని చెప్పారు. అదే స్థాయిలో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య ఏడు లక్షలకు చేరుకున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరగనున్న ఆలిండియా రైల్వే కాంట్రాక్టు వర్కర్స్ కో-ఆర్డినేషన్ కమిటీలో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్టు తెలిపారు. మధు మాట్లాడుతూ రైల్వేల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు చట్టబద్ద సౌకర్యాలు అమలు కావటం లేదని చెప్పారు. పనిదినాలు పడిపోతున్నాయన్నారు. కనీస వేతనాలు అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు కావటం లేదని చెప్పారు. వెంకటేశ్ మాట్లాడుతూ ఆలిండియా సమావేశాలను జయప్రదం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు.