Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- సర్క్యూలర్ 333ని రద్దు చేయాలి
- క్యూబిక్ మీటర్ కొలతలను ఆపాలి.. చట్టప్రకారం వేతనాలివ్వాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్(ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) యాప్ ద్వారానే నమోదు చేయాలని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యూలర్ 333ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్.వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. క్యూబిక్ మీటర్ కొలతలను రద్దు చేసి చట్ట ప్రకారం వేతనాలను చెల్లించాలని కోరారు. మోడీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ చట్టంలో అమలవుతున్న సమ్మర్ అలవెన్స్‌ను రద్దు చేసి కూలీల పొట్టగొట్టిందని విమర్శించారు. ఇప్పుడు పని ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు కూలీల ఫొటోలను మేట్ తన స్మార్ట్ ఫోన్ ద్వారా మస్టర్ అప్ లోడ్ చేస్తేనే వేతనాలు బ్యాంకు ఖాతాల్లో వేస్తామనటం చట్టవ్యతిరేకమైన చర్య అని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్లు లేని మేట్ల పరిస్థితి ఏంటి? రీచార్జి ఎవరు చేయిస్తారు? అని ప్రశ్నించారు. ఏజెన్సీ, వెనుకబడిన ప్రాంతాల్లోని ఆదివాసీ గిరిజనులను, దళితులను, ఇతర పేదలను పనికి దూరం చేసే కుట్ర కేంద్రం నిర్ణయం వెనుక దాగి ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ పని కల్పించాలనే మౌలికాంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని విమర్శించారు.
మ్యానువల్ పద్ధతిలోనే ఉపాధి కూలీల హాజరు వేయాలి
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి : సీఐటీయూ
మ్యానువల్ పద్ధతిలోనే ఉపాధి కూలీల హాజరును నమోదు చేయాలనీ, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ ద్వారానే తీసుకోవాలనే కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్‌నెట్ సౌకర్యం ఇంకా గ్రామీణ ప్రాంతాలకు పూర్తిస్థాయిలో విస్తరించలేదనీ, చాలా గ్రామాల్లో సెల్‌ఫోన్ సిగల్స్ రావని తెలిపారు. ఇప్పటికే దేశంలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన చోట్ల అనేక లోపాలు బట్టబయలు అయినా గుడ్డిగా ముందుకెళ్లాని కేంద్రం చూడటం దారుణమని పేర్కొన్నారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహించే పనులకు కూడా ఇప్పుడు మేట్లే నిర్వహిస్తున్నారనీ, మేట్లకు ఇది మరింత పని భారంగా మారబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులు సజావుగా కొనసాగించడం, తదితర అంశాల దృష్ట్యా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.