Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి పెంచాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగలేఖ రాశారు. పోలీసు నియామకా లకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న అర్హత వయసును మరో మూడేండ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ వయోపరిమితిని మరో రెండేండ్లు పెంచాలని రేవంత్ తన లేఖలో కోరారు. కేవలం మూడేండ్ల వయోపరిమితి పెంచడం ద్వారా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.'చదువులు పక్కన పెట్టి, విద్యా సంవత్సరాన్ని త్యాగం చేసి భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుని ఉద్యమంలో భాగస్వామ్యులయ్యారు. తెలంగాణ లక్ష్యం కోసం మొక్కవోని దీక్షతో పోరాటాలు చేసిన నిరుద్యోగులకు గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం అన్నీ మర్చిపోయి ఏమీ చేయలేదు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టడంతో ఇప్పుడు ఉద్యోగాల కోసం తిరిగి ఉద్యమించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమ నినాదమే నీళ్లు, నిధులు, నియామకాలు. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనీ, భవిష్యత్తు బంగారమవు తుందని భావించిన యువత...పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంది' అని గుర్తు చేశారు. ఎనిమిదేండ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదని రేవంత్ ఈసందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన ఉద్యోగ ప్రకటనలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే వయో పరిమితి పెంచిందని గుర్తు చేశారు. దానిని మరో రెండేండ్లు పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. వయోపరిమితి పెంచకుంటే నాలుగు లక్షల మంది దరఖాస్తుదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన యువతకు ఐదేండ్ల ఐదేండ్లపాటు వయోపరిమితి పెంచాలని కోరారు.