Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ : హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
- ఎన్‌ఐఆర్‌డీపీఆర్ ఆధ్వర్యంలో ప్రకృతివిపత్తుల నివారణపై వర్క్‌షాపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పర్యావరణ విపత్తులకు మన మంతా అనుసరిస్తున్న విధానాలే కారణమని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విపత్తుల నుంచి ప్రకృతిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి జాతీయ శిక్షణా సంస్థలో 'ప్రకృతి విపత్తుల నివారణపై ప్రజలను చైతన్యపర్చడం' అనే అంశంపై వర్క్‌షాపును నిర్వహించారు. ఎన్‌ఐఆర్‌డీపీఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి.నరేంద్రకుమార్‌తో కలిసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తుఫానులు, భూకంపాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, వరదలు రోజురోజుకు పెరిగిపోతుండటంపై ఆయన ఆందోళన వెలిబుచ్చారు. దేశంలోని తీరప్రాంతాల్లో తుఫానుల సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను నిపుణులు పరిశీలించి, వాటి ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. డాక్టర్ జి.నరేంద్రకుమార్ మాట్లాడుతూ..దివిసీమ తుపాన్ సృష్టించిన నష్టాన్ని గుర్తుచేశారు. విపత్తుల నివారణకు, ప్రమాద తీవ్రతను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. ఆసియన్ బయోలాజికల్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రొఫెసర్. ఎస్‌ఎన్ లాబ్ మాట్లాడుతూ.. గ్లోబల్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ రిపోర్ట్-2020లో భారతదేశం ఐదో స్థానంలో ఉందని కూడా తెలిపారు. విపత్తులు అంటే ఏమిటి? ఎలా తలెత్తుతున్నాయి? వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీపీఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శశిభూషణ్, జీఅండ్‌ఐడీఆర్‌ఆర్ హెడ్ ప్రొఫెసర్ సంతోశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.