Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఆర్టీయూటీఎస్ నేతలకు మంత్రి సబిత హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చేనెల మొదటివారంలో కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీలు, మూడోవారంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లకు పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నదనీ, ఈ మేరకు విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని పీఆర్టీయూటీఎస్ నేతలు తెలిపారు. ఈ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కె రఘోత్తంరెడ్డి, పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పింగిలి శ్రీపాల్‌రెడ్డి నేతృత్వంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయ బదిలీల మార్గదర్శకాలపై పలు సూచనలు చేశామని తెలిపారు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న దృష్ట్యా అవి ముగియగానే బదిలీలు, పదోన్నతులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారని పేర్కొన్నారు. పండితులు, పీఈటీలకు సంబంధించి తదుపరి విచారణ వచ్చేనెల 17వ తేదీన ఉన్నందున కోర్టు మార్గదర్శకాలను అనుసరించి పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదివేలకు పెంచుతూ తయారుచేసిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరాయని పేర్కొన్నారు. 25 వేల పైచిలుకు పదోన్నతులు ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు పొందుతారని వివరించారు.