Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని అమ్ముతున్న ఘనత బీజేపీ ప్రభుత్వానిదే
- బీజేపీకి ఓటు వేస్తే ఉరేసుకున్నట్టే..
- శంషాబాద్‌లో సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు సీపీఐ రాష్ట్ర మహాసభలు : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
నవతెలంగాణ-శంషాబాద్
మతోన్మాద, ప్రయివేటీకరణ విధానాలతో ముందుకు వస్తున్న బీజేపీని లౌకిక పార్టీలన్నీ కలిసి గద్దె దించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపునిచ్చారు. బీజేపీకి ఓటు వేస్తే మనకు మనం ఊరేసుకున్నట్టేనన్నారు. 2022 సెప్టెంబర్ 4 నుంచి 7వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్టు సీపీఐ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా శంషాబాద్‌లో మంగళవారం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన నారాయణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్రమైన విమర్శలు చేశారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 14 మంది ప్రధాన మంత్రులు 42 లక్షల కోట్ల అప్పులు చేస్తే, ఈ ఏడేండ్లలో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ ఏకంగా రూ. 82 లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. గతంలో ప్రధానులుగా కొనసాగిన వారందరూ వారి పాలన కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించి, అభివృద్ధి చేశారని తెలిపారు. అనంతరం మోడీ అధికారం చేపట్టాక 23 ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా ప్రయివేటుకు అమ్మేశారని తెలిపారు. దేశంలో డ్రగ్స్ మాఫియా పెద్ద మొత్తంలో జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏమాత్రం ఖాతరు చేయకుండా కోర్టులను సైతం లెక్కచేయకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశద్రోహం కేసు విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అభిప్రాయం చెప్పమంటే ఇప్పటివరకు బీజేపీ నాయకులు నోరు మెదపడం లేదని అన్నారు. రాష్ట్రంలో ఇటీవల అమిత్ షా పర్యటించి తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమను ప్రయివేటుకు ఇవ్వడానికి జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాము నడుపుకోవడానికి అవకాశం కల్పించాలని నిధులను సమీకరించి కాపాడుకుంటామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. త్వరలోనే ప్రజలు బీజేపీకి బుద్ది చెప్తారన్నారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర మూడవ మహాసభలు శంషాబాద్‌లో 600మంది ప్రతినిధులతో నిర్వహించనున్నట్టు తెలిపారు. సభలను విజయవంతం చేసేలా ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో బొమ్మగాని ప్రభాకర్ మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, పుస్తకాల నర్సింగ్ రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు కావలి నరసింహ యాదవ్, పానుగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య, ఆదిరెడ్డి, రామస్వామి, సయ్యద్ అప్సర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.